ఉ. భండన భీముడార్తజన - 100 పద్యాలు

 

ఉ. భండన భీముడు

భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ. 

1.    భండన భీముడు

2.    ఆర్తజన బాంధవుడు

3.    ఉజ్జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ 

4.    భుజ తాండవకీర్తికి

5.    రామమూర్తికిన్

6.     రెండవ సాటిదైవమిక లేడనుచున్

7.     గడగట్టి 

8.     భేరికా దాండద దాండ దాండ

9.     నినదంబులు అజాండము నిండ

10.  నిండ మత్తవేదండమును ఎక్కి చాటెదను

11.  దాశరథీ కరుణాపయోనిధీ

అర్ధాలు:

భండన = యుద్ధములో; భీముడు = భయంకరుడు; ఆర్త జన = కష్టాలలో ఉన్నవారిని; బాంధవుడు = రక్షించేవాడు; ఉజ్జ్వల = ప్రకాశవంతమైన; బాణతూణ = బాణాలను వేసే; కోదండకళా = విలువిద్యలో; ప్రచండ = ఆరితేరిన;  రామమూర్తికిన్ = శ్రీరామునికి! రెండవ సాటి= సాటిరాగలవాడు; ఇక లేడనుచున్ = లేడని; గడగట్టి = కర్రపట్టుకుని; భేరికా = భేరీనాదము;దాండద దాండ దాండ / డాండడ డాండ డాండ = (భేరీకానాదములు); నినదంబులు = ధ్వనులు; అజాండము = ప్రపంచమంతా; నిండ = నిండునట్లు; మత్త వేదండము = మదించిన ఏనుగు; ఎక్కి = ఎక్కి; చాటెదను = చాటుతాను; దాశరథీ = దశరథ నందనా!!; కరుణాపయోనిధీ= కరుణాసముద్రా!;

భావం: రామదాసు వ్రాసిన దాశరథీ శతకంలోని పద్యము.

 

ఓ దశరథనందనా! కరుణాసుద్రా! యుద్ధభూమిలో భయంకరుడూ, కష్టాలలో ఉన్నవారిని రక్షించేవాడూ, విలువిద్యలో ఆరితేరివాడూ అయిన శ్రీరామచంద్రునికి సాటిరాగలవారు లేరని, మదించిన ఏనుగునెక్కి, భేరీధ్వనులతో చాటుతాను! 

Comments