ఉ. చెల్లియొ చెల్లకో - 100 పద్యాలు
చెల్లియొ చెల్లకో, తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్ తొల్లి, గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలున్ బ్రజలు బెంపువహింపగ సంధి సేసెదో ఎల్లి రణంబెగూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా! | |
1. చెల్లియొ చెల్లకో, 2. తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్ తొల్లి 3. గతించె 4. నేడు నను దూతగ బంపిరి సంధిసేయ | 5. నీ పిల్లలు పాపలున్ బ్రజలు బెంపువహింపగ 6. సంధి సేసెదో ఎల్లి రణంబెగూర్చెదవొ 7. ఏర్పడ జెప్పుము 8. కౌరవేశ్వరా! |
అర్ధాలు: చెల్లియొ = ఎదురుకొనే శక్తి ఉండి; చెల్లకో = ఎదురుకొనే శక్తి లేకో; యెగ్గులు = కష్టాలు ; సైచిరందరున్= సైచిరి +అందరున్ = ఓర్చుకున్నారు; తొల్లి = ఇంతకు ముందు; గతించె = జరిగినది; నేడు = ఈ నాడు; నను = నన్ను ; దూతగ = దూతగా; పంపిరి = పంపించారు ; సంధిసేయ = సంధి చేయటానికి ; పెంపువహింపగ =పెరగటానికి ; సంధి సేసెదో = సంధి చేస్తావో; ఎల్లి = రేపు; రణంబె = యుద్ధమే ; గూర్చెదవొ = చేస్తావో; ఏర్పడ జెప్పుము = ఆలోచించి చెప్పు; కౌరవేశ్వరా = కౌరవ + ఈశ్వరా = కౌరవుల రాజా = దుర్యోధనా! | |
భావం: తిరుపతి వేంకట కవులు వ్రాసిన పాండవోద్యోగం అనే పద్య నాటకంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి చెప్పిన పద్యం. ఓ దుర్యోధన మహారాజా! తెలిసో తెలియకో, తమకు కలిగిన కష్టాలు భరించారు. జరిగినదేదో జరగినది. సంధి చేయటానికి, ఇవేళ నన్ను దూతగా పంపించారు. నీవు, నీ పిల్లలు పెరిగి పెద్దవారు కావటం కొరకు సంధి చేస్తావో, కాదని రేపు యుద్ధమే చేస్తావో, ఆలోచించి చెప్పు! |
Comments
Post a Comment