ఉ. విద్య నిగూఢ గుప్తమగు విత్తము - 100 పద్యాలు

 

ఉ. విద్య నిగూఢ గుప్తమగు విత్తము


విద్య నిగూఢ గుప్తమగు విత్తమురూపము పూరుషాళికిన్
విద్య యశస్సుభోగకరి, విద్య గురుండువిదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే? !

1.    విద్య నిగూఢ గుప్తమగు విత్తము

2.    రూపము పూరుషాళికిన్

3.    విద్య యశస్సుభోగకరి

4.    విద్య గురుండువిదేశ బంధుడున్

5.    విద్య విశిష్ట దైవతము

6.    విద్యకు సాటి ధనంబు లేదిలన్

7.    విద్య నృపాల పూజితము

8.    విద్యనెరుంగనివాడు మర్త్యుడే?!

అర్ధాలు:

నిగూఢ రహస్యంగా; గుప్తమగు దాచిపెట్టిన; విత్తము ధనము; రూపము అందము;పూరుషాళికిన్ పురుష ఆళికిన్ = మనుష్యులకు ; యశస్సు కీర్తి (మంచి పేరు); భోగకరి =సుఖాలను కలిగించేది; విదేశ బంధుడున్ = తెలియని చోట్ల బంధువువిశిష్ట = గొప్ప ;దైవతము దైవము; సాటి = సరి పోల్చే ; ధనంబు = ధనము ; లేదిలన్  లేదు + ఇలన్  =భూమి మీద లేదు ; నృపాల = రాజు చేత ; పూజితము  = గౌరవింపబడేది ; విద్యనెరుంగనివాడు = విద్యని ఎరుంగని వాడు విద్య లేని వాడు ; మర్త్యుడే మనిషేనా?;

భావం:

భర్తృ హరి సంస్కృతంలో వ్రాసిన సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి తెలుగులోకి అనువదించాడు. ఈ పద్యం విద్య యొక్క గొప్పతనం గురించి చెబుతున్నది.

 

విద్య రహస్యంగా దాచిపెట్టుకున్న ధనం. మనుషులకు విద్యే అందం. విద్య వల్లనే కీర్తి కలుగుతుంది. సుఖం కలుగుతుంది. ఒక గురువులాగా నడిపిస్తుంది. విదేశాలలో‌మనకు బంధువు విద్యే. అదే అన్నిటికంటే గొప్ప దైవం. విద్యకు సమానమైన సంపద ఈ లోకంలో ఇంకేదీ లేదు. రాజుల చేతకూడా పూజింపబడుతుంది. అటువంటి విద్యను నేర్చుకోనివాడు అసలు మనిషేనా?

Comments