శా. ఇంతింతై వటుడింతయై - 100 పద్యాలు

 

శా. ఇంతింతై వటుడింతయై

ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధి పై
నంతై తోయదమండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై

1.     ఇంతింతై వటుడింతయై 

2.     మరియు దానింతై 

3.     నభోవీధి పైనంతై

4.     తోయదమండలాభ్రమున కల్లంతై 

5.     ప్రభారాశిపై నంతై 

6.     చంద్రుని కంతయై 

7.     ధ్రువునిపై నంతై 

8.     మహర్వాటిపై నంతై 

9.     సత్య పదోన్నతుండగుచు 

10.  బ్రహ్మాండాంత సంవర్ధియై

1.      ఇంతింతై ఇంత + ఇంత + ఐ కొంచెం కొంచెంగా పెద్దవాడు అయి;

2.     వటుడింతయై = వటుడు ఇంత + ఐ  వామనుడు ఇంత వాడు అయి;

3.     మరియు  దానింతై మరియు దాను + ఇంత + ఐ  = ఇంకొంచెం పెద్దవాడయి

4.     నభోవీధి పైనంతై = నభ + వీధి పైన + అంత ఐ  = ఆకాశ వీధి వైపు పెరిగి; 

5.     తోయదమండలాభ్రమున కల్లంతై = తోయద మండల అభ్రమునకు అల్లంత ఐ = మబ్బుల పైకి పెరిగి

6.     ప్రభారాశిపైనంతై = ప్రభారాశి పైన అంత + ఐ  వెలుగుల వైపుగా పెరిగి

7.      చంద్రుని కంతయై = చంద్రనికి అంత + ఐ   చంద్రుని దాటి పోయి;

8.     ధ్రువునిపై నంతై = ధ్రువుని పైన + అంత  =  ధ్రువ నక్షత్రం పైన

9.     మహర్వాటిపై నంతై = మహర్వాటి పైన అంత + ఐ = నక్షత్రాలను దాటి

10.   సత్య పదోన్నతుండగుచు = సత్య పద + ఉన్నతుండు + అగుచు = “సత్యము అనే లోకాన్ని చేరుకొని;

11.    బ్రహ్మాండాంత సంవర్ధియై = బ్రహ్మాండ + అంత సంవర్ధి ఐ = బ్రహ్మాండమంతా నిండిపోయాడు;

భావం: ఈ పద్యం పోతన వ్రాసిన భాగవతంలోని అష్టమ(8) స్కంధంలో, వామన చరిత్ర ఘట్టంలోనిది. వామనుడు బలి చక్రవర్తిని మూడు అడుగులు నేల దానముగా అడిగాడు. బలి దానమిచ్చాడు. అప్పుడు, వామనుడు కొంచెం కొంచెంగా పెరిగి, బ్రహ్మాండము అంతా నిండిపోయిన విధానము వర్ణించే పద్యము.

 

వామనుడు కొంచెం కొంచెగా పెరిగి, ఆకాశంవైపుగా పెరిగి, మబ్బులను దాటి, సూర్యచంద్రల వైపుగా చంద్రుడిని దాటి, ధ్రువ నక్షత్రం దాటి, నక్షత్రాలను దాటి, సత్యము అనే లోకాన్ని కూడా చేరుకొని, బ్రహ్మాండమంతా నిండిపోయాడు. 

Comments