ఉ. దక్షుడు లేని యింటికి - 100 పద్యాలు

 

ఉ. దక్షుడు లేని యింటికి

దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే
లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను, గల్ల గాదు ప్ర
త్యక్షము; వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
యక్షయమైన, గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!

1.    దక్షుడు లేని యింటికిన్ 

2.    పదార్థము వేఱొక చోటనుండి 

3.   వేలక్షలు వచ్చుచుండినన్ 

4.   పలాయనమై చనున్, 

5.    కల్ల గాదు ప్రత్యక్షము; 

6.   వాగులున్ వఱదలన్నియు వచ్చిన

7.    నీరు నిల్చునే

8.   అక్షయమైన 

9.   గండి తెగినట్టి తటాకములోన 

10.   భాస్కరా!

అర్ధాలు:

దక్షుడు = సమర్థుడు; పదార్ధము = వస్తువు; వేలక్షలు = వేలు, లక్షలు = చాలా; పలాయనమై = పరిగెత్తి;చనున్ = పోతాయి; కల్లగాదు = అబద్ధము కాదు; ప్రత్యక్షము = నిజము; వాగులు = కాలువలు; వరదలు = వాన నీళ్లు; అక్షయమైన = చాలా; గండి = గట్టు; తెగినట్టి = తెగిపోతే, విరిగిపోతే; తటాకములోన = చెరువులోన;
భావం: ఈ పద్యం భాస్కర శతకం లోనిది.

ఓ భాస్కరా! సమర్థుడైన యజమాని లేని ఇంటికి లక్షల కొద్దీ వస్తువులు వచ్చిపడినా, అవి నిరుపయోగంగా మారిపోక తప్పదు. గండిపడిన చెరువులోనికి ఎన్ని వాగులు, వరదలు వచ్చి చేరినా నీరు నిలవదు కదా. 

Comments