చ. కదలకుమీ ధరాతలమ - 100 పద్యాలు

 

చ. కదలకుమీ ధరాతలమ - మొల్ల

కదలకుమీ ధరాతలమ, కాశ్యపిఁ బట్టు ఫణీంద్ర, భూ విషా
స్పదులను బట్టు కూర్పమ, రసాతల భోగి ఢులీ కులీశులన్
వదలక పట్టు ఘృష్టి, ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచుఁ బట్టుఁడీ కరులు, భూవరుఁ డీశుని చాప మెక్కిడున్

1.    కదలకుమీ ధరాతలమ 

2.    కాశ్యపిఁ బట్టు ఫణీంద్ర 

3.    భూ విషాస్పదులను బట్టు కూర్పమ 

4.    రసాతల భోగి ఢులీ కులీశులన్

5.    వదలక పట్టు ఘృష్టి 

6.    ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్

7.    పొదువుచుఁ బట్టుఁడీ కరులు 

8.    భూవరుఁ డీశుని చాప మెక్కిడున్

అర్ధాలు:

కదలకుమీ = కదలకుమా; ధరాతలమ = భూమి; కాశ్యపిఁన్ = భూమిని; పట్టు = పట్టుకో;ఫణీంద్ర = ఆదిశేషా;  భూ = భూమిని; విషాస్పదులనున్ = ఆదిశేషుడిని; పట్టు = పట్టుకో; కూర్పమ = తాబేలు; రసాతల = భూమి; భోగి = ఆదిశేషుడు; ఢులీ = తాబేలు; కులీశులన్ = బరువులు మోయువారిని; వదలక పట్టు = వదలకుండా పట్టుకో; ఘృష్టి = వరాహము; ధరణీ = భూమిని; ఫణి =ఆదిశేషుని; కచ్ఛప = తాబేలును; పోత్రి = వరాహమును; వర్గమున్ = బృందాన్ని;పొదువుచుఁన్ = జాగ్రత్తగా; పట్టుఁడీ = పట్టుకోండి; కరులు = ఏనుగులారా; భూవరుఁడు = శ్రేష్ఠమైనవాడు (శ్రీరాముడు); ఈశుని = శివుని; చాపము = విల్లు; ఎక్కిడున్ = ఎక్కుపెట్టబోతున్నాడు;


భావం:
ఈ పద్యం మొల్ల వ్రాసిన రామాయణం లోనిది. శివుని విల్లును ఎక్కు పెట్టబోతున్న శ్రీరాముని చూసి మొల్ల వర్ణన.

 

ఓ భూమాతా! కదలకుమా. ఓ ఆదిశేషా! భూమిని పట్టుకో. ఓ కూర్మమా! భూమిని, ఆదిశేషుడిని పట్టుకో. ఓ వరాహమా! భూమిని, ఆదిశేషుడినీ జాగ్రత్తగా పట్టుకో. ఓ దిగ్గజాల్లారా! భూమిని, ఆదిశేషుడినీ, ఆదివరాహాన్నీ, జాగ్రత్తగా పట్టుకోండి. శ్రీరాముడు శివుని విల్లును ఎక్కు పెట్టబోతున్నాడు.

Comments

Post a Comment