బాలకాండ: 230-239 - అయోధ్యానగర వర్ణన - రంగనాథ రామాయణం
సందర్భము: అయోధ్యా నగర వర్ణన
బాలకాండ: 230-239
ద్వాదశయోజనాత్యాయం బగుచు - నైదుయోజనముల నదివెడ ల్పగుకు
నిపుణత మయునిచే నిర్మితంబగుచు - నెపుడు శాత్రవకోటి కెదురుచుక్కగుచు
కొలఁది మీఱిన భానుకులజులకెల్ల - కులరాజధానియై కొనియాడఁ బరఁగి
సరయువు పొంత కోసలదేశమునను - ధరణికిఁ దొడ వయోధ్యాపురం బొప్పు ;
నిపుణత మయునిచే నిర్మితంబగుచు - నెపుడు శాత్రవకోటి కెదురుచుక్కగుచు
కొలఁది మీఱిన భానుకులజులకెల్ల - కులరాజధానియై కొనియాడఁ బరఁగి
సరయువు పొంత కోసలదేశమునను - ధరణికిఁ దొడ వయోధ్యాపురం బొప్పు ;
భావం: పన్నెండు యోజనాల పొడవు, ఐదు యోజనాల వెడల్పుతో, మయుని ద్వారా నిర్మించబడి, శత్రువలకు దుర్భేద్యమైనది, ఎందరో సూర్యవంశస్థులకు రాజధానిగా పేరొంది, సరయు నది ఒడ్డున, కోసల దేశములో అయోధాపురం భూమిపై గొప్పాగా ఉన్నది.
మణిగోపురంబుల మణితోరణముల - మణికుట్టిమంబుల మణిగవాక్షములఁ
గేళికా గృహములఁ గృతక శైలముల - బాలా నిలంబులఁ బటహ నాదముల
మహిత వారణముల మానితాశ్వముల - బహురథ ప్రతతుల భట కదంబముల
విమల సౌధంబుల విపణి మార్గములఁ - గమనీయ వనములఁ గమలాకరములఁ
జెఱువుల బావులఁ జెఱకుదోఁటలను - దఱుచైన శాలి కేదార వారములఁ
బరిఘలఁ గోటలఁ బసిఁడి మాడువులఁ - గరమొప్ప లోక విఖ్యాతమై పరఁగు
భావం: మణిగోపురములతో, మణితోరణములతో, మణులు పొదగబడిన గచ్చులతో, మణులతో అలంకరించబడిన కిటికీలతో, విశ్రాంతి గృహములతో, కృత్రిమమైన ఎత్తైన కొండలతో, చిన్నచిన్న ఇళ్లతో, భేరీ ధ్వనులతో, గొప్ప ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో, రకరకముల సైన్యములతో, సౌధాలతో, వ్యాపార మార్గాలతో, సుందమైన ఉద్యావనాలతో, కమలాలు నిండిన చెరువులతో, బావులతో, చెరకు తోటలతో, వరిధాన్యం సమృద్ధిగా పండు చేలతో, కోటలయందు బంగారు గోపురాలతో ప్రకాశించు అయోధ్యాపురము ప్రఖ్యాతి గాంచినది.
--
శాత్రవ = శత్రువు
ఎదురుచుక్క = శత్రుత్వం
కుట్టిమము = రాతికట్టడపు నేల
వారణ = ఏనుగు
తరుచైన = ఆరోగ్యవంతమైన
శాలి = వరి
కేదార = వరి పండు నేల
పరిఘ = కోట గుమ్మము
మాడువు = హర్మ్యము, ఎత్తైన భవనము
కరమొప్పు = ప్రకాశించు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment