అయోధ్యాకాండ: 1516-1531 - చిత్రకూట పర్వతము వర్ణన - రంగనాథ రామాయణం
సందర్భము: శ్రీరాముడు జానకితో చిత్రకూట పర్వతమును వర్ణన చేయుట
అయోధ్యాకాండ: 1516-1531
"కనుఁగొంటివే యిన్నగంబు బింబోష్ఠి - కనుదమ్ములకు విందు గావించె మనకు
నిన్నగ మహిమఁ దానెన్నఁగ వశమె? - పన్నగ పతికైన భామాలలామ
నిన్నగ మహిమఁ దానెన్నఁగ వశమె? - పన్నగ పతికైన భామాలలామ
భావం: సీతా! చూసావా ఈ పర్వతాన్ని. కళ్లకు ఎంత కమనీయగా విందు చేస్తున్నాయో. ఈ పర్వత మహిమను వర్ణించుట (అనేక నాల్కలు ఉన్న) ఆ ఆదిశేషునికైనా సాధ్యమేనా?
గుఱుతైన సెలయేటి ఘుమఘుమ ధ్వనులు - ఉఱుము లటంచుఁ బెల్లుబ్బి నీకురులు
పురడింపఁ దనగొప్ప పురి విచ్చి నెమలి - పొరిఁబొరి యాడెడుఁ బూఁబోణి చూడ
భావం: సీతా! ఈ సెలయేటి నుండి వచ్చే అలల ధ్వనులు విని, ఉరుముల శబ్దమేమో అని, ఆ నెమళ్లు పురి విప్పి ఆడుతున్నాయి చూడు.
కాంతరో! యీ చెంచు కాంతల కంటె - దంతి కుంభంబులు తమ చన్నుఁగవకు
నెన వచ్చు టెట్లని యిభకుంభ దళన - మొనరించి తన్మణు లొప్పఁ దాల్చెదరు
నెన వచ్చు టెట్లని యిభకుంభ దళన - మొనరించి తన్మణు లొప్పఁ దాల్చెదరు
భావం: సీతా! ఈ చెంచు యువతులు చూడు, ఏనుగుల కుంభములు తమ చన్నుల ధీటుగా ఉన్నాయని వాటిని భేదించి వాటిలోని మణులను వీరు ధరించారు.
దివ్యుల సంకేత దేశంబు గాన - దివ్యవాసనలు సంధించె నీ కోన
పదతలాలక్తకర భాసురంబైన - పొగఁ జూడ గంధర్వ భోగ గేహంబు
పదతలాలక్తకర భాసురంబైన - పొగఁ జూడ గంధర్వ భోగ గేహంబు
భావం: దేవతలు తిరిగే ప్రదేశం కాబోలు, ఈ అడవిలో నుండి దివ్యమైన సుగంధాలు వస్తున్నాయి. ఆ పొగలు చూడు గంధర్వుల గృహాల భోగాలు కాబోలు.
కిన్నరకంఠి! యీ గిరి గహ్వరంబు - కిన్నర కిన్నరీ గీత సద్గోష్ఠి
కలకంఠ రవ సహకార పల్లవము - కలకంఠి! యీ సహకారంబుఁ జూడు ;
కలకంఠ రవ సహకార పల్లవము - కలకంఠి! యీ సహకారంబుఁ జూడు ;
భావం: సీతా! ఈ పర్వత గుహలు, కిన్నర-కిన్నరీ పాటలతో ప్రతిధ్వని సూచనగా, ఈ గండు కోయిలలు అన్నీ కలసి చేస్తున్న గానము చూడు.
పరిపరి విధముతో బరువంపు విరుల - పరిమళంబులు గదంబముగఁ గూర్చుచును
మలయానిలుండు కోమలయాన లీల - మలయచున్నాఁ డిదె! మనపైన నబల!
మలయానిలుండు కోమలయాన లీల - మలయచున్నాఁ డిదె! మనపైన నబల!
భావం: సీతా! రకరకముల పూవుల సువాసనతో కలిపి ఆ మలయ పర్వతడు చల్లని, మెత్తని గాలులు మనపైన వీచుచున్నాడు.
యల్లదె! చూచితె? హల్లక నికర - ఫుల్ల కైరవ కంజ పుంజ రంజితము
సాల,తమాల, రసాల తక్కోల - తాళ, హింతాల, కుద్దాల, కూలములు
సాల,తమాల, రసాల తక్కోల - తాళ, హింతాల, కుద్దాల, కూలములు
భావం: అదిగో! చూసావా! చెంగలువలు, విప్పారిన తెల్ల కలువలు, నల్ల కలువలతో అందగా ఉన్నాయి. సాల, తమాల, తాళ, వంటి వృక్షాలు ఉన్నాయి.
అమలిన పులిన మధ్యాసనా సీమ - సముచిత మునిబృంద సందీప్తమైన
మందాకినీ నది మనకన్ను లలరె - మందయాన విలాస మథిత మరాళ"
మందాకినీ నది మనకన్ను లలరె - మందయాన విలాస మథిత మరాళ"
భావం: ఈ మునులతో వెలిగిపోతున్న ఈ అడవి మధ్యలో, ఈ మందాకినీ నది నెమ్మగా నడుస్తున్న హంసలతో ఎంత అందంగా ఉన్నదో!
--
ఇన్నగము = ఈ నగము = ఈ పర్వతము
కనుదమ్ములు = పద్మాక్షమ్ములు, పద్మాల వంటి కనులు
హల్లక = చెంగలువ
కైరవ = తెల్లకలువ
కంజ = కలువ
పుంజ ప్రోగు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment