అయోధ్యాకాండ: 1-18 - శ్రీరాముని వర్ణన - రంగనాథ రామాయణం
సందర్భము: దశరధుడు ఒకనాడు శ్రీరాముడు అన్ని విధాలా అర్హుడని ఆలోచించి, పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు.
అయోధ్యాకాండ: 1-18
శ్రీలీల దశరథోర్వీపాలుఁ డవనిఁ - బాలించుచుండి చొప్పడ నొక్కనాఁడు
భావం: శుభకరంగా, దశరథ మహారాజు, రాజ్యపాలన చేస్తూ, ఒకనాడు
సుతులు నల్వురలోన శుభతరమూర్తి - యతుల యశోనిధి యగుచున్న వాని
భావం: తన నలుగురు కొడుకులలోనూ శుభకరుడైన, అతి కీర్తిమంతునిగా అవుతున్న (శ్రీరాముని)
హిత బుద్ధియగువాని నెల్లభూతముల - హితమునం గరుణ నన్వేషించువానిఁ
భావం: ప్రతిదినమూ పేదల మనసులను సంతోషపరచువాడైన, మంచి బుద్ధి కలవాడైన, ప్రతి జీవాన్ని కరుణతో చూచువాడైన (శ్రీరాముని)
ననిశంబు సంతుష్టుఁ డైయుండువానిఁ - గొనియాండ దగిన సద్దుణములవానిఁ
భావం: చతుర్విధ పురుషార్ధముల వారిని తన చిత్తములో ఆదరించువాడైన, తృప్తితో జీవించువాడైన, సద్గుణ సంపన్నుడైన (శ్రీరాముని)
గజహయారోహణ క్షముఁ డగువాని - విజయలక్ష్మీ సమన్వితుఁ డగువాని
భావం: దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయగల ప్రభుశక్తి ఉన్నవాడైన, ఏనుగులు గుర్రాలు అధిరోహించగల వాడైన, విజయుడైన (శ్రీరాముని)
మానని రోషంబు మది లేనివాని - మానుగా భృత్యుల మన్నించువాని
భావం: బుద్ధిశాలి, క్రమశిక్షణ గలవాడైన, అనవసరమైన ప్రగల్భాలు లేనివాడైన, తన దగ్గర పనిచేసే వారిని మన్నించే వాడైన (శ్రీరాముని)
గరుణాసముద్రుఁడె కడుమించువాని - బరుల గుణంబులు పాటించువాని
భావం: యుద్ధవిద్యలో ఆరితేరిన వాడైన, అసూయ లేని వాడైన, కరుణాసముద్రుడైన, అందరిని ఆదరించువాడైన (శ్రీరాముని)
నమిత ప్రజానంద మలరించువాని - గుముద బాంధవుభంగిఁ గొమరొందువాని
భావం: బుద్ధిలో బృహస్పతిని మించువాడైన, కాంతి తేజములో సూర్యుడిని పోలువాడైన, ప్రజలను అలరించువాడైన, చంద్రుని వలే చల్లని వాడైన (శ్రీరాముని)
న్యాయ మార్గంబున నర్థార్జనంబు - పాయక సేయ నేర్పఱి యగువాని
భావం: విలు విద్య, వేదాలు, శాస్త్రాలు వంటి విద్యలలో నేర్పుగల వాడైన, న్యాయ మార్గంలో సంపాదనము చేయు నేర్పరితనము గలవాడైన (శ్రీరాముని)
శ్రీరాముపట్టాభిషేకంబు చేసి - ధారణిం బాలింపఁ దలపోసి యంత
భావం: ఓర్పు, సహనము వంటి గొప్ప గుణాలు కలవాడైన, శ్రీరామునికి పట్టాభిషేకము చేయవలెనని తలపోసి...
--
వెరవరి = ఉపాయశాలి
పురణించు = వర్ధిల్లు
ఇద్ధతేజము = ప్రకాశము
సైరణ = సహనము
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment