అరణ్యకాండ: 719-738 - శూర్పణఖ చేత శ్రీరామ, లక్ష్మణ, సీతా వర్ణన
సందర్భము: శూర్పణఖ రావాణాసురుని వద్దకు వచ్చి శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత యొక్క వర్ణన చేస్తున్నది.
అరణ్యకాండ: 719-738
నున్నతోన్నత వక్షుఁ డుత్పలశ్యాముఁ - డిన్ని లోకములకు నెక్కుడు వాఁడు
మిగులఁ జక్కని వాఁడు మిహిర మండలము - దెగడు తేజము వాఁడు ధీర వర్తనుఁడు
మిగులఁ జక్కని వాఁడు మిహిర మండలము - దెగడు తేజము వాఁడు ధీర వర్తనుఁడు
నాజానుబాహుఁ డుదగ్ర విక్రముండు - రాజీవనేత్రుండు రామచంద్రుండు
నతఁడె పో ఖరదూషణాది రాక్షసులఁ ? గృతమతి నొంటిగా గెలిచినజోదు
నతఁడె పో ఖరదూషణాది రాక్షసులఁ ? గృతమతి నొంటిగా గెలిచినజోదు
భావం: విశాలమైన వక్షము కలవాడు, అన్నిలోకాలలోనూ అధికమైన వాడు, చాలా చక్కని వాడు, సూర్యమండలము మించిన తేజము కలవాడు, ధీరుడు, ఆజానుబాహుడు, అత్యంత పరాక్రమవంతుడు, రాజీవ నేత్రుడు - అటువంటి రామచంద్రుడు, ఖరదూషణాది రాక్షసులను ఒంటరిగా గెలిచిన వీరుడు.
హేమవర్ణుఁడు గాని యిన్నిచందముల - సౌమిత్రి రఘురాముచందంబువాఁడు
వాఁడెపో నా కీయవస్థ గావించి - నాఁ డింక సీతసౌందర్యంబు వినుము
భావం: బంగారు రంగులో ఉన్న సౌమిత్రి, రఘురాముడంతటి వీరుడు. అతడే నాకు ఈ అవస్ధ చేసాడు. ఇక సీత సౌందర్యము గురించి విను.
తెఱఁగొప్పఁ జూచితి దేవకామినులఁ - దఱిగొని చూచితి దనుజకన్యకల
కేలిమైఁ జూచితిఁ గిన్నరాంగనలఁ - బోలించి చూచితి భోగికామినులఁ
గలయంగఁ జూచితి గంధర్వసతుల - నలవడఁ జూచితి యక్షకామినులఁ
జూచితిఁ బార్వతిఁ జూచితి రతినిఁ - జూచితి భారతిఁ జూచితి లక్ష్మి
జూచితి రంభను జూచితి శచిని - జూచితి భూలోకసుందరు లెల్ల
మునుకొని చూచితి మునికన్యకలను - బనివడి చూచితి బ్రాహ్మణస్త్రీల
భావం: నేను, దేవతా స్త్రీలను చూసాను, రాక్షస, కిన్నెర, భోగినీ గంధర్వ, యక్ష స్త్రీల తో సరి పోల్చిచూసాను, పార్వతి, రతి, సరస్వతి, లక్ష్మి, రంభ, శచీదేవి, భూలోక సందరీమణులందితో పోల్చి చూసాను, ముని కన్యలనూ, బ్రాహ్మణ స్త్రీలతో కూడా సరిపోల్చి చూసాను.
నాచన్ను లాకన్ను లాముద్దుపల్కు - లాచెక్కు లాముక్కు లాసోయగంబు
లాతరు లాకురు లావాలుచూపు - లాతొడ లాయొడ లాయొయారంబు
లామందహాసంబు లావిలాసంబు - లామృదుగమనంబు లాసుమనంబు
నే ముందు పొడఁగాన నేయింతులందు - భూమిజ నేమని భూషింతుఁ జెపుమ,
నెగడ లోకము లేలు నీయట్టి పతికిఁ - దగుఁగాక యాయింతి తగునె యన్యులకు ?
నాయిందుబింబాస్య యాచకోరాక్షి - యాయెలజవ్వని యాకుందరదన
నాయిందుబింబాస్య యాచకోరాక్షి - యాయెలజవ్వని యాకుందరదన
యామత్తగజయాన యాలతకూన - యీమానినీమణి యాపద్మ గంధి
యాయింతి నీయింతి యై యుండెనేని - నీయాన దనుజేశ నీరాజ్య మొప్పుభావం: ఆ చన్నులు, ఆ కన్నులు, ఆ ముద్దు పలుకులు, ఆ చెక్కిళ్లు, ఆ ముక్కు, ఆ సోయగము, ఆ తరులు, ఆ కురులు, ఆ వాలుచూపులు, ఆ ఉరులు, ఆ ఒడలు, ఆ వయ్యారము, ఆ మందహాసము, ఆ విలాసము, ఆ నడక, ఆ ఛాయ - ఇంతవరకూ నేనెక్కడా చూసి ఉండలేదు. అటు వంటి స్త్రీ లోకాలను శాసించగల నీవంటి వానికే తగినది. ఆ చంద్రముఖి, ఆ చకోరాక్షి, ఆ జవ్వని, ఆ కుందరదన, ఆ గజగామిని, ఆ సుకుమారి, ఆ మానినీమణి, ఆ పద్మగంధి, నీ మీద యాన, ఆ స్త్రీ నీ స్త్రీ అయితేనే నీ యొక్క రాజ్యము గొప్పదనిపించుకుంటుంది.
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment