ఉ. రాజులు కాంతియందు - 100 పద్యాలు

 

ఉ. రాజులు కాంతియందు - మొల్ల

రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు వాహినీ
రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళి యందు గో
రాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రా
రాజులు మానమందు నగమ్మున రాజకుమారులందరున్

1.    రాజులు కాంతియందు (చంద్రుడు)

2.    రతిరాజులు రూపమునందు (మన్మథుడు)

3.    వాహినీ రాజులు దానమందు (సముద్రుడు)

4.    మృగరాజులు విక్రమకేళి యందు (సింహం)

5.    గోరాజులు భోగమందు (వృషభం)

6.    దినరాజులు సంతత తేజమందు (సూర్యూడు)

7.    రారాజులు మానమందు (దుర్యోధనుడు)

8.    నగరమ్మున రాజకుమారులందరున్

అర్ధాలు:

కాంతి = వెలుగు; రతిరాజు = మన్మథుడు; వాహినీ = నది;  మృగరాజు = సింహం; విక్రమకేళి = బలములో; గోరాజు = గోవులకు రాజు = వృషభం; దిన రాజు = సూర్యుడు; సంతత = ఎల్లప్పుడూ; తేజము = వెలుగు; రారాజు = దుర్యోధనుడు; నగరము = అయోధ్య నగరము;

భావం:
ఈ పద్యం మొల్ల వ్రాసిన రామాయణం లోనిది. అయోధ్యా నగరంలోని రాజకుమారులను వర్ణిస్తున్న పద్యం.


ఆ నగరములో రాజకుమారులు, కాంతిలో చంద్రునిలాగా, రూపములో మన్మధుని లాగా, దానములో సముద్రునిలాగా, బలంలో సింహములాగా, భోగాలు అనుభవించడంలో వృషభంలాగా, ఎప్పుడూ వెలిగే సూర్యునిలాగా, పౌరుషంలో దుర్యోధనుడిలాగా ఉంటారు.

Comments