ఉ. మంగళమమ్మకున్ - 100 పద్యాలు

ఉ. మంగళ మమ్మకున్‌

మంగళ మమ్మకున్ సకల మంగళ మంబుజ నేత్రకున్ జయా
మంగళ మిందిరాసతికి మంగళ మీయలమేలుమంగకున్
మంగళమందు నే మఱియు మంగళమందును దేవలోక ది
వ్యాంగన లెల్ల నీసతికి నారతు లిత్తురు వేంకటేశ్వరా

1.    మంగళము అమ్మకున్‌

2.    సకల మంగళము అంబుజ నేత్రకున్‌

3.    జయా మంగళము ఇందిరాసతికి

4.    మంగళము ఈ అలమేలుమంగకున్‌

5.    మంగళము అందు నే

6.    మఱియు

7.    మంగళము అందును

8.    దేవలోక దివ్యాంగన లెల్ల

9.    నీ సతికిన్ ఆరతులు ఇత్తురు

10. వేంకటేశ్వరా!

అర్ధాలు:

మంగళము = శుభము; అంబుజ నేత్రకున్ = పద్మముల వంటి కన్నలు ఉన్న; జయామంగళము = జయము, శుభము; ఇందిరా సతికి =లక్ష్మీదేవికి ; అలమేలు మంగకున్ = అలమేలు మంగకు; మంగళమందు నే = నేను శుభము అంటున్నాను; మఱియు = ఇంకా; దేవలోక = దేవ లోకంలో ఉన్న; దివ్యాంగనలెల్ల = దివ్య + అంగనలు + ఎల్ల = దేవతా స్త్రీలు అందరూ ; నీ సతికిన్ = నీ భార్యకు; ఆరతులిత్తురు = ఆరతులు ఇత్తురు = హారతి ఇస్తారు; వేంకటేశ్వరా = ఓ వేంకటేశ్వర స్వామీ!;

భావం:

ఇది అన్నమాచార్య వ్రాసిన “వేంకటేశ్వరా అలుమేలుమంగా శతకం”లోని పద్యం.

 ఓ వేంకటేశ్వరా! నీ భార్యకు, నాతో కలసి దేవతాలోకములో ఉన్న స్త్రీలందరూ కూడా ఇలా హారతులిస్తున్నారు – అమ్మా! శుభమునీకు, పద్మాక్షీ  అంతా శుభమునీకు,  లక్ష్మీదేవి విజయము నీకు, అలమేలుమంగా శుభమునీకు కలుగుగాక!

 

Comments