కిష్కింధా కాండ: 688-725 - వర్షాకాల వర్ణన
సందర్భము: శ్రీరాముడు, వాలిని సంహరించి సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేసాడు. వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం పూర్తి అయిన తరువాతు సీతను వెతుకుదామని నిర్ణయించుకున్నారు. శ్రీరాముని దుఃఖము, రాబోవు రావణసంహార ఘట్టము ప్రకృతిలో కనిపిస్తున్నాయి.
కిష్కింధా కాండ: 688-725
ధరణిజ నెడఁబాసి తలఁకెడు రాముఁ - బొరిపొరి దుఃఖము ల్పొదువు చందమున
నఱిముఱి దివినుండి యంబుజ మిత్రు - మెఱయనీ కందంద మేఘము ల్వొడమె
భావం: సీతను విడిచిన రాముడిని దుఃఖాని ముంచివేసినట్లుగా సూర్యుడిని వర్షాకాల మేఘములు కప్పివేసాయి.
రావణురాజ్యంబు రఘురాముచేత - నీవిధి చలియించు నింక నన్పగిడి
నొలసి యొండొండ విద్యున్ని కాయములు - జలదంబులందుండి చలియింపఁదొడఁగెఁ
భావం: రావణుని రాజ్యము రఘురాముని చేత, కదలింప బోవునట్లు సూచనగా మేఘాలనుండి మెరుపులు కదలుతున్నాయి.
గైకొని యింక నిక్ష్వాకులవల్ల - నాకారిపై దండు నడుచుచున్నాఁడు
అని సురలకుఁ
జెప్ప నరిగెనో ధాత్రి - యన వాయువులఁ దోడ నట ధూళి యెసఁగె.
భావం: ఇక్ష్వాకుని వంశజులు రావణునిపై దండెత్తుతున్నారని దేవతలకు చెప్పటానికి భూమి మీద గాలి, దుమ్ము ఎత్తుకు లేస్తున్నాయి.
నాలంబులో దైత్యు నణఁగింపు మనుచుఁ - గాలుఁడు తన చేతి కాలదండంబుఁ
బొనర రాముని కిచ్చి పుత్తెంచె ననఁగఁ - దనరార దివి నింద్రధను వొప్పెఁ జూడ.
భావం: రావణాసురుడిని సంహరించడానికి, యముడు తన చేతిలోని కాలదండాన్ని రామునికి ఇస్తున్నాడేమో అన్నట్లుగా, ఇంద్రధనస్సు కనిపిస్తోంది.
నమరులు రామునకై దండు వెడలఁ
- గొమరార భేరులు ఘోషించుపగిది
నున్నత ధ్వనులతో నొండొండఁ బర్వి - మిన్నెల్ల భేదిల్ల మేఘంబు లుటిమె.
భావం: దేవతలందరూ రాముడికి దండులాగా, యుద్ధభేరీలు మ్రోగిస్తూ వస్తున్నారేమో అన్నట్లుగా ఆకాశమంతా పిక్కటిల్లేలాగా మేఘాలు ఉరుముతున్నాయి.
నలరు ప్రావృట్కాల మఘపురుషుండు - లలిమీఁద నాకాశలక్ష్మితోఁ గదియ
నొగి సరు ల్దెగి
రాలుచున్న ముత్యముల - పగిదిఁ దొల్చినుకులు వడియె నందంద
భావం: ఇంద్రుడు ప్రేమగా ఆకాశలక్ష్మిని కలిసినప్పుడు, మెడలోని ముత్యాలు తెగి నేల మీద రాలుతున్నట్లుగా, తొలిచినుకులు పడుతున్నాయి.
యగపడి చెఱవోయె నని కూఁతుఁ దలఁచి - వగచి నిట్టూర్పులు వడిఁ బుచ్చుకరణి
వెఱవున లావులు వెడలె నందంద - ధరణి నెల్లెడల నుదగ్రంబు లగుచుఁ
భావం: చెఱలో ఉన్న కూతురు కోసం బాధతో నిట్టూర్పులు విడుస్తున్నట్లుగా భూదేవి కనిపిస్తోంది.
జనుదెంచి రామలక్ష్మణ పయోదములఁ - గనుఁగొని సుర చాతకము లుబ్బు పగిది
గనుఁగొనఁ బర్వెడు ఘన పయోదములఁ - గనుఁగొని దివి చాతకము లుబ్బ దొడగె.
భావం: రామలక్ష్మణుల మేఘములను చూసి దేవతల వానకోయిల సంబరపడు వెలెనే, పెద్దపెద్ద మేఘాలను చూసి ఆకాశంలో ఉన్న వానకారు కోయిలలు సంబరపడుతున్నాయి. (?)
ధిమిధిమి యనుచు మద్దెల మ్రోయుపాట - లమర నదీమణు లాడుచందమునఁ
ఘుమఘుమ మనుడు మేఘుండు గర్జింప - సమరఁ గేకా స్ఫూర్తి నాడె నెమళ్లు.
భావం: నదీజలాల ధిమిధిమి మద్దెల మ్రోతలతో, మేఘాల గర్జనలతో యుద్ధానికి సిద్ధమన్నట్లుగా నెమళ్లు ఆడుతున్నాయి.
రాక్షసాంగములపై రాముబాణములు - లక్షింపఁ బడు నిట్టిలాగు నన్నట్లు
పర్వతాగ్రములపై భయద ఘోషములు - పర్వి నిర్ఘాతము ల్వడియె నందందఁ
భావం: రాక్షసులపై రామ బాణాలు గురి పెట్టి వదలి నట్లుగా పర్వతశిఖరాలపైన భయంకరమైన పిడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి.
బ్రకటంబుగా దైత్యపతి మేనిమాంస - శకలంబు లిటు రణస్థలి నిండు ననిన
పరుసున నింద్రగోపము లంతకంత - నరుణారుణంబులై యవనిపైఁ బడియె
భావం: రావణాసురుని శరీరఖండములు యుద్ధభూమిలో పడినట్లుగా, ఆరుద్ర పురుగులు భూమిమీద ఎర్రగా పడుతున్నాయి.
రావణుఁ జంపుచో రఘురాముమీఁద - దేవతల్తలలూచి దివ్యపుష్పములు
నెడనెడ వర్షింతు రీక్రియ నవిన - వడువున మహి రాలె వర్షోపలములు.
భావం: రావణాసురుడిని చంపిన తరువాత శ్రీరాముని తల మీద దేవతలు పువ్వులు వర్షింప చేసినట్లుగా చినుకులు పడుతున్నాయి.
రావణుకీర్తిపరంపర లణఁగి - పోపు నిం కిట రామభూపాలు చేత
ననిన చందమున రాయంచలపిండు - చని క్రౌంచగిరిమీఁదఁ జయ్యన నడచె
భావం: శ్రీరామునిచే, రావణాసురుని కీర్తి అణగిపోవుట తప్పదన్నట్లుగా క్రౌంచ పర్వతం మీద రాజహంసలు నడుస్తున్నాయి.
ననిమొనఁ దనపుత్రుఁడైన సుగ్రీవుఁ - డనిమిషాధిపసూను నకట చంపించె
నలుగు నాపై నింద్రుఁ డని సూర్యుఁ డున్న - బలితంపు కోటన్న పరివేష మొనరె
భావం: ఇంద్రుని కొడుకైన వాలిని, సూర్యుని కొడుకైన సుగ్రీవుడు చంపించెనని, తనపై కోపం ఇంద్రుడు చేస్తాడేమోనని, సూర్యుడు, తన సూర్యమండలమనే కోటలో దాక్కున్నాడేమో అన్నట్లుగా ఉన్నది.
గుదియని కడకతో గోది యాకాశ - నది నాడఁబోయిన నాగకన్యకలు
చని చని మగుడ రసాతలంబునకుఁ - జనుదెంచుగతి వర్షజలధార లమరె
భావం: ఆకాశనదిలో జలకాలాడిన నాగకన్యలు తిరిగి పతాళానికి వెళ్తున్నట్లుగా వర్షజలధారలు కనిపిస్తున్నాయి.
వాసిగాఁ దమకు జీవనము లవ్వారి - గా సమర్పించిన ఘనుని వేనోళ్లఁ
బొగడుచందమున సద్భుతవృత్తిభేద - మగుచు మండూకంబు లఱచె నందంద
భావం: తమకు చక్కగా నీటిని అందించిన వానికి వేనోళ్లతో పొగుతున్నవా అన్నట్లుగా కప్పలు బెకబెక అని అంటున్నాయి.
వలయ మేఘములు ప్రావృఢ్వధూమణికిఁ - గలయ మైఁ బూసిన కస్తూరి యనఁగ
ధరణి నెల్లెడలను దనువు సొంపెక్కి - పరఁగ నీలచ్ఛాయ పంక మొప్పారు
భావం: చక్కగా అలంకరించుకున్న ఒక స్త్రీ తనపై పైన పూసుకున్న కస్తూరి పూతలాగా, భూమి మొత్తం నల్లటి మేఘములు, నల్లటి బురద ఆవరించుకున్నాయి.
వారాశి నొడఁ గూడి వల నేది రాము - ఘోరబాణాగ్నిఁ గ్రాగుట విచారించి
చఱచి పో వెఱచిన చాడ్పున వరద - లఱిముఱిఁ జెఱువుల నందంద నిలిచె
భావం: శ్రీరాముడు సముద్రుని మీద ఘోరబాణాగ్ని వేస్తాడని తెలియడం వలననేమో, వరద నీరు సముద్రాన్ని చేరుకోకుండా, అక్కడికక్కడే చెరువులలో నిలచిపోయింది.
లోకకంటక దైత్యు లోఁబెట్టు కొంటిఁ - గాకుత్ స్థుఁ డిదె
నిన్ను ఖండించు ననుచు
సుడిఁబడి మొఱవెట్టుచును భానుకరణి - వడి మ్రోయుడును
జొచ్చె వారి పెన్నదుల
భావం: లోక కంటకుడైన రావణాసురుడు కనబడకుండా ఇంతకాలం దాచినందుకు, శ్రీరాముడు తనను దండిస్తాడేమో అన్నట్లుగా, భయముతో వడివడిగా సూర్యుడు బయటకు వస్తున్నాడు.
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment