653-665: హనుమంతుడు అశోకవనములో రాక్షసులను చంపుట - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం
సందర్భము: హనుమంతుడు అశోకవనాన్ని నాశనం చేస్తూ, తనను ఆపటాని వచ్చిన రాక్షసులను చంపుట.
సుందరాకాండ: #607-#618
ధరణికి లంఘించి తనదువాలమున - నురుశక్తి గళముల కుఱిగా బిగించి
యురువడి కనుగుడ్లు, నుఱకంగఁ ద్రిప్పి - సురుఁగక వక్రనాసుని వ్రేసి చంపెఁ
యురువడి కనుగుడ్లు, నుఱకంగఁ ద్రిప్పి - సురుఁగక వక్రనాసుని వ్రేసి చంపెఁ
జంపి యంతటఁ బోక సమయని కినుకఁ - దెంపు సొంపును బెంపు సొంపు దీపింపఁ
బెడ పెడ నార్చుచుఁ బిడుగునకంటె - బెడిదమై కనుపట్టు పిడికిటిచేతఁ
బుడమిపై నురురక్తములు గ్రక్కి కూల - వడి నశ్మవక్షుని వక్షంబు పొడిచె
పొడిచి బాహాగర్వమున మాఱులేక - కడఁకఁ గనుంగొని కఱకు రాక్షసులు
మొగి ద్రుంచి శార్దూలముఖు లలాటంబు - పగులంగ గద దిప్పి పడవైచి చంపె
నటు చంపి క్రోధాగ్ను లందందఁ నిగుడఁ - గుటిల రాక్షసకుల క్షోభంబు గాఁగ
గ్రూరుఁడై పింగళాక్షుని తోఁకఁ గట్టి - కారాకు సుడిగాలి గడువడిఁ ద్రిప్పు
తీరున వాని దిర్దిర మింటఁ ద్రిప్పి - తోరణ స్తంభంబుతో ప్రేసి చంపె
వాని నిమ్మైఁ జంపి వరశక్తి యుక్తి - పూని దానవ సైన్యములఁ జొచ్చి కలఁచి
యురవడి దీర్ఘజిహ్వుని వచ్చి తాఁకి - యురుముష్టి సంహతి నుర్విపైఁ గూల్చి
యాలోనఁ బవనజుఁ డసమాన విజయ - లోలుఁడై వాని నాలుక పీకి చంపె
భావం: హనుమంతుడు, భూమి మీదకు దూకి, తన తోకతో రాక్షసుల గొంతులకు ఉరిగా బిగించి, కళ్లు తేలవేసేట్లుగా త్రిప్పి, వక్రనాసుడు అనే రాక్షసుడిని క్రిందకు వేసి చంపినాడు. పిడుగు కన్నా భయంకరమైన పిడికిలి చేత, అశ్మవక్షుడు అనే రాక్షసుడిని, రక్తము క్రక్కుకొని నేలపై పడిపోయేట్లు పొడిచినాడు. తన బలమైన చేతులతో, గదను చేతపట్టి, త్రిప్పి శార్దూలముఖుడు అనే రాక్షముడి నుదురు పగులకొట్టి చంపినాడు. పింగాళాక్షుడు అనే రాక్షసుడిని తోకతో కట్టి, ఎండుటాకును సుడిగాలి లాగా, ఆకాశంలో త్రిప్పి, తోరణ స్తంభానికేసి కొట్టి చంపినాడు. రాక్షస సైన్యంలో ఉన్న దీర్ఘజిహ్వుడు అనే రాక్షసుడిని, గ్రుద్దులతో భూమిపై కూల్చి, హనుమంతుడు వాని నాలుకను పీకివేసి చంపినాడు.
--
కడక = యత్నము
కారాకు = ఎండుటాకు
మొగి = విధము
అశ్మ = మేఘము
సురుగు = చలించు
సమయు = నశించు
కినుక = కోపము, అలుక
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment