406-417 - త్రిజట స్వప్నము - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం
సందర్భం: రాక్షసస్త్రీలు సీతాదేవిని బెదిరిస్తున్న సమయంలో తోటి రాక్షసస్త్రీ త్రిజట తన స్వప్నము చెప్తోంది.
సుందరాకాండ: #406-#4174
రాముఁ డేనుఁగు నెక్కి రాఁ జూడఁ గంటి - సౌమిత్రి భృత్యుఁడై చనుదేరఁ గంటి,
నామహాగజముపై యవనీతనూజ - కోమలి నెక్కించుకొని పోవఁ గంటిఁ
బట్టాభిషిక్తుఁడై బ్రహ్మా దిసురలుఁ - గట్టిగాఁ గొల్వ రాఘవుఁ డుండఁ గంటిఁ
గమనీయ మగుపుష్పకముమీఁదనుండి - బ్రమని రావణుఁ డుర్విపైఁ గూలఁగంటిఁ, గూలిన రావణుఁ గ్రూరాసి యొకతె - నీలాంబరముతోడ నెఱిఁ జేరఁ గంటి,
చేరి రావణుతల ల్చెలు వేది కూల్చి - భూరిగార్దభములఁ బూనినరథము
నం దుగ్ధమున వైచి యామ్యదిక్కునకుఁ - గొందలపడి యెత్తుకొని పోవఁ గంటి.
గురుతరోష్ట్రము నెక్కి కుంభకర్ణుండు - తిర మేది దక్షిణదిశ కేగఁ గంటిఁ.
దనరారు తోరణతతులతోఁ గూడ - వనధిలోపల లంక వడిఁ గూలఁ గంటి,
నతికాయ మకరాక్షు లాయింద్రజిత్తు - ప్రదనవిక్రము లుర్విపైఁ గూలఁ గంటి,
గనకపీఠంబుపైఁ గారుణ్యమూర్తి - యొనర విభీషణుం డుండంగఁ గంటి,
రావణుమరణంబు రఘురాముజయము - నీవిధంబున సిద్ధ మిటమీఁద నింక ;
భావం: రాముడు ఏనుగును ఎక్కి రావడం చూసాను. లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు. ఆ ఏనుగు మీద సీతను ఎక్కించుకొని పోవడం చూసాను. పట్టాభిషిక్తుడైన రాముడిని అందరూ కొలవడం చూసాను. పుష్పక విమానము మీద నుండి రావణుడు నేల మీదకు కూలిపోవటం చూసాను. రావణుని తలలను గాడిదల రథము మీద దక్షిణ దిక్కుగా పోవడం చూసాను. కుంభకర్ణుడిని మోసుకుపోతున్న ఒంటెను చూసాను, లంకలోని అలంకారాలన్నీ సముద్రంలో కలసిపోవడం చూసాను. అతికాయుడు, మకరాక్షుడు, ఇంద్రజిత్తు నేలకూలటం చూసాను, విభీషణుడు బంగారు సింహాసనం మీద కూర్చోవడం చూసాను. రావణుని చావు, శ్రీరాముని విజయము తథ్యము.
--
నెఱి = విధము
యామ్యదిక్కు = దక్షిణం దిక్కు
ఉష్ట్ర = ఒంటె
వనధి = సముద్రం
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment