309-314 - సీతాదేవి తృణీకరణ - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం
సందర్భం: అశోకవనంలో ఉన్న తన దగ్గరకు వచ్చిన రావణాసురుని తృణీకరించి, సీతాదేవి మాటలు.
సుందరాకాండ: #309-#314
నెండతోఁ బ్రాలేయ మెదరించినట్లు - కొండతో దగరు మార్కొనిన చందమున
మదహస్తితో దోమ మార్కొన కరణి - నుదధితోఁ గాల్వ మెడొడ్డిన పగిది
శ్రీతర్వుతో వేము, శ్రీశుతో జోగి - ధాతతో విప్రుండు, ధనికుతోఁ బేద
జాతిరత్నముతోడ సరి గాజుపూస - భూతలంబున సరిపోల్చిన యట్లు
తెగువమై రాఘవాధిపునకు నీకు - మగఁటిమి మదహస్తిమశకాంతరంబు
మిగుల నోరులు గల్గి మీఱి పల్కెదవు - జగతి రామునితోడ సరియె రాక్షసుఁడ
భావం: ఎండను మంచు ఎదిరించినట్లు, కొండను పొట్టేలు ఎదిరించినట్లు, మదపుటేనుగుతో దోమ ఎదిరించినట్లు, సముద్రంతో కాల్వ పోల్చుకున్నట్లు, మారేడు వృక్షంతో వేప చెట్టు, విష్ణుమూర్తితో సన్యాసి, బ్రహ్మదేవునితో బ్రాహ్మణుండు, ధనికునితో పేదవాడు, జాతిరత్నముతో ఒక గాజుపూస పోల్చినట్లు ఆ శ్రీరామునితో నీ పౌరుషము పోల్చితే, ఏనుగును దోమను పోల్చినట్లే. నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. రామునితో నీకు పోలికా!
--
ప్రాలేయము = మంచు
తగరు = పొట్టేలు
మార్కొను = ఎదురుకొను
ఉదధి = సముద్రము
శ్రీ = మారేడు
శ్రీశు = విష్ణువు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment