213-218 : అశోక వనంలో సీత - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సుందరాకాండ: #213 - #218 (page: 236, pdf page: 255)

యిన రశ్మి వాడిన యెలదీగె బోలె - ఘనధూమయుత దీపకళికయు బోలె
జలదమాలికలోని శశికళవోలె - బలుమంచు బొదివిన పద్మిని వోలె
చెలగి పిల్లులలోని చిలుకయు బోలె - బులులలో నావును బోలె దుర్వార
ఘోరరాక్షస వధూకోటిలో నున్న - నారీశిరోమణి నలినాయతాక్షి
మలినాంగి యలివేణి మాతంగగమన - కలితభూషణజాల గద్గదకంఠి
జనితోష్ణ నిశ్వాస సతతోపవాస - జనక తనూజాత జగదేకమాత

భావం: ఎండలో వాడిపోయిన తీగలాగా, మసిబారిపోయిన దీపంలాగా, మబ్బులు కమ్మేసిన చంద్రుని లాగా, పొగమంచు విరిసిన పద్మంలాగా, పిల్లుల మధ్యలో చిలుకలాగా, పులుల మధ్యలో ఆవులాగా – క్రూరమైన రాక్షసుల మధ్యలో – స్త్రీలలో గొప్ప స్త్రీ, చక్కటి కన్నులున్నది, అందమైనది, చక్కని జుట్టు ఉన్నది, ఆభరణాలు లేకున్నది, సామజవర గమన, గద్గదమైన కఠంతో, వెచ్చటి ఊపిరి వదులుతూ, ఉపవాసాలు చేస్తూ - జనకుని కూతురు జానకి ఉన్నది.

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments