కావ్య భాష - పత్రికల భాష - పోలిక
సరదాగా కొన్ని చొప్పదంటు ప్రశ్నలు. పోతన భాగవతంలోని కావ్యభాషలో ఏ అక్షరం ఎక్కవ వాడబడినది? పొడి అక్షరాలు ఎక్కువ వాడబడ్డాయా లేకపోతే సంయుక్తాక్షరాలా? ద్విత్వాలా? అసలు ఎన్ని అక్షరాలు వాడబడ్డాయి? ఏ అక్షరం ఎన్నిసార్లు వాడబడినదో ఒక పట్టిక తయారుచేయచ్చా? అలాగే, ఈ కాలంలోని వార్తాపత్రికలలోని తెలుగు భాషకు కూడా ఒక అక్షరాల పట్టిక తయారుచేసి, పోతన భాగవతం ద్వారా వచ్చిన అక్షర పట్టికతో పోలిస్తే ఏమవుతుంది? ఏమి విషయాలు తెలుకోవచ్చు?
మొబైల్ యాప్స్ చేసిన అనుభవంతో ఇలాంటి గణాంకాల పట్టిక ఒకటి తయారు చేసాను.
- కావ్య భాషలో "న,ని,న్,ను" (3.66 + 2.23 + 2.06 + 2.02 = 9.97%)అత్యంత ప్రధానమైన అక్షరాలు. విడిగా వాడబడిన ఈ అక్షరాలే కాకుండా, గసడవాదేశ సంధి, సరళాదేశ సంధి ద్వారా కనబడని న-కారాలు కూడా చాలా ఉంటాయి. ఆంధ్రభాషను కావ్యభాషగా మలచడంలో ఈ న-కారాలు ఒక ప్రధాన భూమికను పోషిస్తాయి.
- వార్తాపత్రికల భాషలోకూడా "న్,ను" తగ్గినా "న,ని" అంతగా తగ్గలేదు.
- నీలం రంగు అంకెలను చూస్తే, లు,న - అక్షరాలు ఎక్కువగా వార్తా పత్రికల భాషలో ఉన్నాయి.
- ఎరుపు అంకెలను గమనిస్తే, కావ్యభాష నుండి పత్రిక భాషలో కొన్ని అక్షరాల వాడుక తగ్గింది.
- ము-కారము తగ్గిపోయింది. ఉదా - "కావ్యము, స్నేహము" కాస్తా "కావ్యం, స్నేహం" గా మారాయి.
- న్ - పొల్లు అక్షరం కావ్యాలకు ప్రత్యేకం కదా. ఉదా - తెలిసెన్, చింతించెదన్
- వంగపండు రంగు అక్షరాలను గమనిస్తే , కొన్ని అక్షరాల వాడుక సుమారుగా అలాగే ఉన్నది.
మొదట్లో "చొప్పదంటు" ప్రశ్నలని తేలికగా అన్నుకున్నా, అవి చాలా ఉపయోగ పడే ప్రశ్నలు. తెలుగు భాష ఎటువంటి మార్పులకు గురి అవుతున్నదో గణాంకాలతో తెలుసుకోవచ్చు. ఎంతో మంది శ్రమకోర్చి తయారుచేసిన యూనికోడ్ పుణ్యమా అని, తద్వారా telugubhagavatam.org, andhrabharati.com, తెలుగు వార్తాపత్రికలు వంటివన్నీ ఒక త్రాటిమీదకు వచ్చాయి. వాటివలన ఇలాంటి గణాంకాలు చేయవీలగుతున్నది. యాంత్రిక జీవనవిధానంతో భాషలో వచ్చే మార్పులను అవే యంత్రాలతో (software) నెమ్మదిగా మనకు కావలసి విధానంగా ముందుకు తీసుకొని పోవచ్చు.
ఒక ముఖ్య గమనిక. పైన విషయాలను సశాస్త్రీయ గణాంకాలుగా భావించరాదు. వార్తా పత్రికలలోని, కేవలం 20MB తెలుగు అక్షరాల నమూనా మాత్రమే గ్రహించడమైనది. విపులమైన, విస్తారమైన, నిర్దిష్టమైన Data Cleansing పద్ధతులను పాటించలేదు. ఎవరి నుంచి రెండవ అభిప్రాయము తీసుకొనలేదు.
Comments
Post a Comment