భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 25

24వ భాగంలో కర్మ, జ్ఞానేంద్రియాల ద్వారా, పరమాత్మ యొక్క స్పృహ, భక్తుల విషయంలో ఎలా చిత్రించారో చూసాం. అదే విషయం గోపికల ద్వారా ఎలా చూపించారో, దశమ స్కంధం నుంచి మూడు పద్యాలలో చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. శ్రీకృష్ణుడు కాళింది మడుగులోకి దూకాడు. గోపికలతో సహా అందరూ ఆదుర్దా పడుతున్నారు.
రెండవది. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం, చిటికెన వేలుపై ఎత్తి, ఏడురోజుల పాటు గాలివానల నుండి అందరినీ కాపాడాడు. వానాకాలం పోయి శరదృతువు వచ్చింది. గోపికలు శ్రీకృష్ణుని రాక కోసం చూస్తున్నారు.

మూడవది. కంసుడు, అక్రూరుని ద్వారా బలరామకృష్ణులకు ఆహ్వానం పంపించాడు. ఇద్దరూ మధుర విడిచి ద్వారక వెళ్లారు. కంసుని సంహరించారు. శ్రీకృష్ణుని సందేశంతో ఉద్ధవుడు మధురకు వచ్చాడు. గోపికలు నిష్ఠూరాలు పోతూ బాధపడుతున్నారు.

ఇవిగో పద్యాలు.
10.1-659-సీ. (కాళింది మడుగు వద్ద గోపికలు విలపించుట) 
శ్రవణరంధ్రంబులు సఫలతఁ బొందంగ నెలమి భాషించు వా రెవ్వ రింకఁ? 
గరచరణాదుల కలిమి ధన్యత నొంద నెగిరి పైఁ బ్రాఁకు వా రెవ్వ రింక? 
నయనయుగ్మంబు లున్నతిఁ గృతార్థములుగా నవ్వులు చూపు వా రెవ్వ రింక? 
జిహ్వలు గౌరవశ్రీఁ జేరఁ బాటల యెడఁ బలికించు వా రెవ్వ రింక

తండ్రి! నీవు సర్పదష్టుండవై యున్న నిచట మాకుఁ బ్రభువు లెవ్వ రింక? 
మరిగి పాయ లేము; మాకు నీ తోడిద లోక మీవు లేని లోక మేల?"

10.1-991-సీ. (శరదృతువులో గోపికల దీనాలాపములు) 
నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱఁ గాని-తరలి పోవంగఁ బాదములు రావు; 
నీ కరాబ్జంబులు నెఱి నంటి తివఁ గాని-తక్కిన పనికి హస్తములు చొరవు; 
నీ వాగమృతధార నిండఁ గ్రోలనె గాని-చెవు లన్యభాషలఁ జేరి వినవు; 
నీ సుందరాకృతి నియతిఁ జూడఁగఁ గాని-చూడ వన్యంబులఁ జూడ్కి కవలు;

నిన్నెకాని పలుకనేరవు మా జిహ్వ; లొల్ల ననుచుఁ బలుకనోడ వీవు 
మా మనంబు లెల్ల మరపించి దొంగిలి తేమి చేయువార మింకఁ? గృష్ణ!

10.1-1484-సీ. (ఉద్ధవుని కడ గోపికలు వగచుట) 
విభుఁడు మా వ్రేపల్లె వీధుల నేతేరఁ జూతుమే యొకనాడు చూడ్కు లలరఁ? 
బ్రభుఁడు మాతో నర్మభాషలు భాషింప విందుమే యొకనాఁడు వీను లలరఁ? 
దనువులు పులకింప దయితుండు డాసినఁ గలుగునే యొకనాఁడు కౌఁగలింపఁ? 
బ్రాణేశు! మమ్మేల పాసితి వని దూఱఁ దొరకునే యొకనాఁడు తొట్రుపడఁగ?

వచ్చునే హరి మే మున్న వనముఁ జూడఁ? దలఁచునే భర్త మాతోడి తగులు తెఱఁగుఁ? 
దెచ్చునే విధి మన్నాథుఁ దిట్టువడక? యెఱుఁగ బలుకు మహాత్మ! నీ కెఱుఁగ వచ్చు."

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. మూడూ సీసపద్యాలు. మూడింటిలోనూ శ్రీకృష్ణుని రాక కోసం ఎదురుచూపులు చూస్తూన్న గోపికలు. ప్రతి పద్యంలోనూ మొదటి నాలుగు పాదాలు ఇంద్రియాల ద్వారా భగవంతుని ధ్యానం. ఈ దృష్టితో పద్యాలు చదువుకుంటే గోపికల స్థానంలో అపర భక్తులు మనకు కనిపిస్తారు. భాగవత కర్త మనకు తెలియజేయాలనుకున్న విషయం కొంత బోధపడుతుంది. విడిగా మూడింటిలో ఉన్న కళ్లు, కాళ్లు, చెవులు, చేతుల వగైరా గురించి చెప్పుకోనక్కర లేదు.

ప్రతి సీస పద్యం చివరిలో వచ్చే ఎత్తుగీతిలో ఆ భగవంతుడిని చేరాలని ఆర్తితో కూడిన కోరిక. మొదటి పద్యంలో “మాకుఁ బ్రభువు లెవ్వ రింక?” అంటే, రెండవ దానిలో ”మా మనంబు లెల్ల మరపించి దొంగిలి తేమి చేయువార మింకఁ గృష్ణ!”, మూడవ దానిలో ”దెచ్చునే విధి మన్నాథుఁ దిట్టువడక?”

ఇటువంటి పద్యాలే, మరొక రెండు, తరువాతి భాగంలో చూద్దాం.

Comments