భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 20

త్రిమూర్తులకు మూల తత్వమైనటువంటి పరమాత్మ తత్వాన్ని, ఒక చిన్న కంద పద్యంగా 17 వ భాగంలో చూసాం. అదే భావన మొదటి స్కంధంలో నాలుగు స్తుతి పద్యాలుగా ఎలా కనబడుతుందో చూద్దాం. ఈ నాలుగు పద్యాలు షష్ఠ్యాంతాలుగా పిలువబడే వరుస పద్యాలు. ఇవి మొదటి స్కంధంలో ఇష్టదేవతారాధన పద్యాల తరువాత వచ్చే పద్యాలు.

ఇవిగో ఆ నాలుగు షష్ఠ్యాంతాలు.

1-29-ఉ హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.

1-30-ఉ శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా పాలికి, వర్ణధర్మపరిపాలికి, నర్జునభూజయుగ్మ సం చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.

1-31-ఉ క్షంతకుఁ, గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా రంతకు, నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ హంతకు, నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.

1-32-ఉ. న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం ధాయికిఁ, బీతవస్త్రపరిధాయికిఁ, బద్మభవాండభాండ ని ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. నాలుగు పద్యాలూ ఉత్పల మాలలు, షష్ఠ్యంతాలు. నాలుగు పద్యాలూ శ్రీకృష్ణుని మీద పద్యాలు. వీటిని రెండు మూడు పొరలుగా పరిశీలిద్దాం.

మొదటి పొర. పద్య నిర్మాణం, విరుపు. ప్రతి పద్యమూ మొదటి భ-గణం దగ్గర విరుపున్నది. మొదటి పద్యంలో ప్రతి పాదం “..హారికి”, రెండవ పద్యంలో “శీలికి, ..(ని)ర్మూలికి, ...(గోపగోపికా)పాలికి, (సం)చాలికి ” - ఇలాగన్నమాట.

రెండవ పొర. విషయ నిర్మాణం. ప్రతి పద్యంలోనూ తరువాత దశమ స్కంధలోని దుష్టశిక్షణ-శిష్టరక్షణ, అలాగే దుఃఖాలను దూరంచేయుట, సుఖాలను కలుగచేయుట గురించిన ప్రస్తావన.ఉదాహరణకి, మొదటి పద్యంలో “చక్రసమీరదైత్య సంహారికి”, “భక్తదుఃఖపరిహారికి” - రెండవ దానిలో, “బాణ హస్త నిర్మూలికి” - మూడవ దానిలో “ఘోర వాహినీ హంతకు” వగైరా. నాల్గవ పద్యం, కాస్త వేరుగా, ఆనందం కలుగ చేయుట మీద ఎక్కువ దృష్టి ఉన్నది - నందనదాయికి, మనస్థ్సాయికి, విధాయికి, అనురాగ సంధాయికి.... ఇలాగ. ఎందుకని?

మూడవ పొర. ఈ నాలుగు పద్యాలనూ అనుసంధానం చేస్తున్న అనుప్రాసలు. మొదటి పద్యం “హారి, విహారి, సంహారి, పరీహారి ...” అంటూ రి-కార ప్రాస-అనుప్రాస, రెండవ పద్యంలో “శీలికి, శాలికి, శూలికి, నిర్మూలికి...” అంటూ లి-కార ప్రాస-అనుప్రాస. ఇక మూడవది “క్షంతకు, క్రియారంతకు,హంతకు...” అంటూ త-కార ప్రాస. ఏమిటి వీటి విశిష్టత? 

మొదటిది “హరి” శబ్దాన్ని పోలి ఉండి విష్ణువును తలపిస్తున్నది కదా. లి-కార ప్రాస “వాలిన భక్తి మ్రొక్కెద...(1-2-ఉ.)” అంటూ సాగే భాగవతంలోని శివస్తుతి పద్యాన్ని పోలి ఉన్నది. త-కార ప్రాస “ఆతత సేవ సేసెద...(1-3-ఉ.)” అంటూ సాగే బ్రహ్మదేవుని స్తుతి పద్యాన్ని పోలి ఉన్నది. అంటే షష్ఠ్యాంతాలైన మొదటి మూడు పద్యాలు, శ్రీకృష్ణుని స్తుతి చేస్తున్నా కూడా, శబ్దమాత్రము చేత త్రిమూర్తులను తలపిస్తున్నాయి. ఇక నాల్గవ పద్యం ఆ త్రిమూర్తులకు మూలతత్వమైన పరమాత్మ యొక్క స్తుతి, యి-కార ప్రాస-అనుప్రాసతో ఉన్నదని ప్రతిపాదించ వచ్చు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ “మహానందాగనా డింభకు”డు కదా మరి, అందుకని విషయ నిర్మాణం అంతా మహానందమయం చేసాడు పోతన.

Comments