భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 16

ఈ భాగంలో ఒకటే భావన రెండు గొంతుకలలో ఎలా పలకుతాయో చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోనిది. హిరణ్యకశిపుడు, తన కొడుకైన ప్రహ్లాదునికి హరిభక్తి వలదని చెప్పి గురువులతో మరల పంపించినాడు. తిరిగి వచ్చిన కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకుని, “ఏదైనా ఒక్క పద్యం, తాత్పర్యము చెప్పు కన్నతండ్రీ!” అన్నాడు. ప్రహ్లాదుడు మళ్లీ హరిభక్తి చిట్టా విప్పాడు. హరి సేవ చేయని శరీరము, ఒక శరీరమే కాదన్నాడు.

రెండవది. దశమ స్కంధం ఉత్తర భాగంలోనిది. పరీక్షిత్తు మహారాజు, శుకమహర్షి చెప్పే భాగవతుల కథలు వింటున్నాడు. “ఆహా! హరి సేవ చేసే ఆ భాగవతులే భాగవతులు” అంటూ గుర్తుచేసుకుంటున్నాడు. (మరొక భక్తుని గురించి చెప్పమని అడుగుతాడు. ఫలితంగా శుకమహర్షి, కుచేలుని కథ చెప్పటానికి ఉపక్రమిస్తాడు.)
కమలాక్షు నర్చించు కరములు కరములు- శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ; 
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు- శేషశాయికి మ్రొక్కు శిరము శిరము; 
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు- మధువైరిఁ దవిలిన మనము మనము; 
భగవంతు వలగొను పదములు పదములు- పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి; 

దేవదేవుని చింతించు దినము దినము; చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు; 
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు; తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
హరిభజియించుహస్తములుహస్తము; లచ్యుతుఁగోరి మ్రొక్కు త 
చ్ఛిరము శిరంబు; చక్రధరుఁ జేరిన చిత్తము చిత్త; మిందిరా 
వరుఁగను దృష్టి దృష్టి; మురవైరి నుతించిన వాణి వాణి; య 
క్షరుకథ లాను కర్ణములు కర్ణములై విలసిల్లుఁబో భువిన్.

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ వేరువేరు పద్యరీతులైనా(ఒకటి పెద్ద సీసపద్యమైతే, రెండవది చంపకమాల), ఇక్కడ శిల్పమంతా వాడిన అలంకారంలోనే ఉంది. కరములు-కరములు, జిహ్వ జిహ్వ, చూడ్కులు-చూడ్కులు ... అంటూ మొదటి పద్యంలో ఉంటే, రెండవ దానిలో హస్తములు-హస్తములు, శిరము-శిరంబు, చిత్తము-చిత్తము.. అని ఉంది. దీనినే లాటానుప్రాసము అంటారు.

మరొక విషయం చెప్పుకోవాలి. పెద్ద పద్యమైనా మొదటి పద్యంలో విరుపు నిర్దిష్టంగా ఉంది. ఇది ప్రహ్లాదుని నిశ్చల, నిర్మల భక్తిని తెలుపుతుంది. రెండవ దానిలో విరుపు అంత విడిగా, పొడిగా ఉండదు. భాగవతుల కథల గురించి తలచుకుంటూ, మైమరచిపోతున్న పరీక్షిత్తు, మరొక భాగవతుని గురించి తెలుసుకోవాలనే ఆతృత, ఉత్కంఠత కనిపిస్తాయి. పోతన, ఏడవస్కంధంలోని శిల్పాన్ని ఎంచుకుని, ఈ కుచేలుడు కూడా ప్రహ్లాదుని వంటి భక్తాగ్రేసురుడే అని చెప్పబోయే కథను మనకు సూచిస్తున్నాడు.

Comments