భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 10

ఈ భాగంలోని ద్వంద్వ శిల్పానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఒక పద్యంలోని భావాన్ని తీసుకొని మరొక పద్యంలో దానిని సగమే వాడుకొని మిగతా సగాన్ని వైరుధ్యంతో (contrast) నింపబడినది. ముందుగా కథా భాగం.

మొదటిది. రుక్మిణీ కల్యాణ ఘట్టం. పదవ స్కంధం పూర్వభాగంలోని చరమఘట్టం. రుక్మిణి చిన్నపిల్లగా ఉన్నది. ఆటపాటలతో పెరుగుతోంది. బాలావస్థ. వాత్సల్యపూరిత పద్యం. శాంత,కరుణరస ప్రధానం.

రెండవది. నరకాసుర వధ ఘట్టం. పదవ స్కంధం ఉత్తర భాగంలోని ఘట్టం. శ్రీకృష్ణ సమేత సత్యభామ నరకాసురినితో పోరుకు సిద్ధమైనది. ఆశ్చర్యం కలిగిస్తోంది. వీరరస ప్రధానం.

ఇవిగో పద్యాలు. పూర్తి అర్థం కోసం ఆయా లంకెలు నొక్కండి.
పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు; నబలలతోడ వియ్యంబు లందు; 
గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి; చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి; 
రమణీయ మందిరారామ దేశంబులఁ; బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు; 
సదమల మణిమయ సౌధభాగంబుల; లీలతో భర్మడోలికల నూఁగు;

బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు; శారికా కీర పంక్తికిఁ జదువు సెప్పు; 
బర్హి సంఘములకు మురిపములు గఱపు; మదమరాళంబులకుఁ జూపు మందగతులు.
బొమ్మ పెండిండ్లకుఁ బో నొల్ల నను బాల; రణరంగమున కెట్లు రాఁ దలంచె? 
మగవారిఁ గనినఁ దా మఱుఁగుఁ జేరెడు నింతి; పగవారి గెల్వనే పగిదిఁ జూచెఁ? 
బసిఁడియుయ్యెల లెక్క భయ మందు భీరువు; ఖగపతి స్కంధమే కడిఁది నెక్కె? 
సఖుల కోలాహల స్వనము లోర్వని కన్య; పటహభాంకృతుల కెబ్భంగి నోర్చె?

నీలకంఠములకు నృత్యంబుఁ గఱపుచుఁ నలసి తలఁగిపోవు నలరుఁబోఁడి 
యే విధమున నుండె నెలమి నాలీఢాది మానములను రిపులమాన మడఁప?


ఇప్పడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ సీసపద్యాలు. మొదటి పద్యంలో బొమ్మల పెండ్లిండ్లు చేస్తూ, బంగారు ఊయలల ఊగుతూ, బంతులాడుతూ, పక్షులతో మాటలాడుతూ, ఆడుతూ ఉంటుంది రుక్మిణి. ఒక రాచకన్య చిననాడు పెరిగిన వివరాన్ని, ఆహ్లాదమైన వాతావరణాన్ని మనకు పోతన చిత్రించాడు. అలాగే, చిన్ననాడు సుకుమారంగా పెరిగిన మరొక రాచకన్య సత్యభామ. ఈమె ఇప్పుడు వీరోచితంగా యుద్ధం చేస్తునది. సత్యభామ, రుక్మిణి కన్నా సుకుమారమైనదని సూచిస్తున్నాడు. “బొమ్మల పెండ్లిండ్లకు కూడా పోలేను” అనే ఆమె రణరంగానికి ఎలా వచ్చింది? పసిడి ఉయ్యాల ఎక్కడానికి భయపడే ఆమె గరుడపక్షిని ఎలా ఎక్కింది? సఖుల కోలాహలాన్ని కూడా ఓర్చుకోలేని కోమలి యుద్ధభేరీలను ఎలా ఓర్చుకుంది?

ఇటువంటి చిత్రణ చాలా సహజంగా ఉన్నది. మనం సాధారణంగా, “అరే! నోట్లో వేలుపెట్టినా కొరకలేని వాడు ఇలాంటి అఘాయిత్యం ఎలా చేసాడు?” అని ఆశ్యర్యపోతూంటాం. పోతన చేయాలనుకున్నది అదే. రెండు వైరుధ్య, వైవిధ్య రసాలను పోషించాలన్నది ముఖ్యోద్దేశం. అందుకే మొదటి పద్యంలోని సగమే తీసుకొని మరొక సగాన్ని జోడించి పండించాడు. ఈ సందర్భంలోనే, ఒక ప్రక్కన కృష్ణునికి శృంగారం ఒలికిస్తూ, అలవోకగా మరొక ప్రక్క వీరోచితంగా నరాకాసుర వధ చేస్తున్న మరొక పద్యం (10.2-178-మ పరుఁ జూచున్ వరుఁ జూచు) చాలా ప్రసిధ్ధమైనది.

పుల్లటి చింతపండుతో రసం చేస్తూ ఒక తియ్యటి బెల్లం ముక్క వేస్తాం, తీయటి బిస్కట్లు చేస్తూ - ఒక రవ్వ ఉప్పు, ఎర్రకారం వేస్తాం, సాంబారు తింటూ కరకరలాడే ఒడియాలు, అప్పడాలు నంచుకుంటాం - ఇలా వైరుధ్యమైన రుచులతో చేసిన వంటలు ఆస్వాదించడాని నోటికి ఇంపుగా ఉంటాయి. సంగీత కచ్చేరీలలో కూడూ రెండు వైరుధ్యరాగాలను తీసుకొని అదీ ఇదీ కలుపుతూ చేసే విన్యాసం శ్రోతలను ఆకట్టుకుంటాయి. ఉదాహరణకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన అమృతవర్షిణి-ఆనందభైరవి రాగం-తానం-పల్లవి వినండి. ప్రధానరసం అంటూ ఒకటున్నా వెనుకనే మరొకదానిని జోడించటం వలన నోటికి రుచి, కంటికి అందం, వీనులకు విందు, మనసుకు ఆనందం, ఆహ్లాదం.

-- 
ఈ రెండు పద్యాలను సూచించిన ఉమ కిరణంగారికి ధన్యవాదాలు. ఆవిడ, తమ చిచ్చర పిడుగుతో కలసి చేసిన ఈ సీసపద్యాల వివరణ ఇక్కడ వినవచ్చు : పేర్వేర బొమ్మల - బొమ్మ పెండ్లిండ్లు.

Comments