భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 9

ఈ భాగంలోని ద్వంద్వ శిల్పం కోసం, వేరువేరు చోట్ల చూడవలసిన అవసరం లేదు. ఒక వరుసలో ఉంటాయి. జంట ద్వంద్వాలు. సందర్భం అలాంటిది.

ఏడవ స్కందంలోని ప్రహ్లాదచరితంలోనిది. హిరణ్యకశిపుడు, తన కొడుకు యొక్క విష్ణుభక్తితో విసిగిపోయాడు. నానా హింసలూ పెట్టించాడు. ప్రహ్లాదుడు అన్నింటినీ నవ్వుతూ భరించాడు. ఎటువంటి మార్పూలేదు. పైపెచ్చు తోటి రాక్షస బాలకులకు కూడా విష్ణుభక్తి బోధించసాగాడు. పరిస్థితి విషమించిపోయిందని, కొడుకు చేయిదాటి పోతున్నాడని హిరణ్యకశిపుడు రంగంలోనికి దిగాడు. వినయంతో మాటకుమాట జవాబు చెబుతున్నాడు ప్రహ్లాదుడు.

ఇవిగో వరుస పద్యాలు.

7-261-క. దిక్కులు గెలిచితి నన్నియు దిక్కెవ్వఁడు? రోరి! నీకు దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేఱొక దిక్కెఱుఁగక కొలుతు రితఁడె దిక్కని నన్నున్."

7-262-క. బలవంతుఁ డ నే జగముల బలములతోఁ జనక వీరభావమున మహా బలుల జయించితి నెవ్వని బలమున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడ వై."

7-263-వ. అనినఁ దండ్రికి మెల్లన వినయంబునఁ గొడు కిట్లనియె.

7-264-క. "బలయుతులకు దుర్బలులకు బల మెవ్వఁడు? నీకు నాకు బ్రహ్మాదులకున్ బల మెవ్వఁడు ప్రాణులకును బల మెవ్వం డట్టి విభుఁడు బల మసురేంద్రా!

7-265-క. దిక్కులు కాలముతో నే దిక్కున లేకుండుఁ గలుగుఁ దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యెడు వాఁడు నాకు దిక్కు మహాత్మా!

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. 7-261, 7-262 హిరణ్యకశిపుని మాటలు 7-264, 7-265 ప్రహ్లాదుని మాటలు. రెండు కందపద్యాలకు మరో రెండు కందపద్యాలు వచ్చాయి. అన్ని దిక్కులు గెలిచానన్నాడు హిరణ్యకశిపుడు. దిక్పాలకులందరూ తననే కొలుస్తున్నారన్నాడు. మహాబలులందరినీ జయించానన్నాడు. ప్రహ్లాదుడు, వినయంగా, విష్ణువంటేనే బలం, విష్ణువు దిక్కులేని వారికి దిక్కు అంటూ జవాబు చెప్పాడు.

“దిక్కులు..., బలవంతుడ...” అంటూ హిరణ్యకశిపుడన్నాడు. ప్రహ్లాదుడు అదే క్రమంలో అనలేదు. “బలయుతులకు..., దిక్కులు...” అంటూ తిరుగు జవాబు వచ్చింది. ఆలోచిస్తే, వేసిన వాగ్బాణం తిరిగొచ్చినప్పుడు, క్రమం మారుతుంది కదా మరి. అదే పోతన చమత్కారం. పైగా హిరణ్యకశిపుడి కన్నా ప్రహ్లాదుని జవాబులో రెండు “బల” శబ్దాలు, ఒక “దిక్కు” ఎక్కువే ఉన్నాయి.

ఇద్దరు విద్వాంసులు కలసి చేసే సంగీత కచ్చేరీలలో, ఇలాంటి “సవాల్-జవాబ్” (ప్రశ్నోత్తరాలు) రక్తికట్టిస్తాయి. ఒక విద్వాంసుడు ఒక “సంగతి” అనగానే పక్క విద్వాంసుడు దానికి మించిన “సంగతి”తో జవాబు ఇస్తారు. అటువంటి ప్రశ్నోత్తరాల వడి పెరిగి తారస్థాయికి చేరి, ప్రేక్షకుల చప్పట్లతో ఆగుతుంది.

అలాగే, ఇది రసపట్టైన సన్నివేశం. సాధారణంగా కోపంతో రగిలిపోతున్న వ్యక్తికి మారు జవాబు చెబితే మరింత రెచ్చగొట్టినట్టవుతుంది. అదే పోతన పండించాలనుకొన్నది. హిరణ్యకశిపుడు “ఎక్కడరా హరి?” అని అడగడం, స్ధంభం నుంచి నరసింహావతార ఆవిర్భావం రాబోతున్నాయి. దానికి ముందు మెట్టుగా ఈ పద్యాలొచ్చాయి. అందుకే మాటలలో వడి,వాడి,వేడి పెరిగింది. మాటకు మాట వచ్చింది. నరసింహావతారానికి ముందుగా ఒక్కసారి విష్ణువు సర్వవ్యాపకత్వం, హిరణ్యకశిపుని వరాలకన్నా మిన్నయని గుర్తుచేసి (చూ. ద్వంద్వ శిల్పం - 5, 7-274-మ), ఇక నరసింహావతార ఆవిర్భావాన్ని (7-285-వ) వర్ణించే అద్భుతమైన ముక్తపదగ్రస్థ వచనానికి ఇది నాందీ ఘట్టం.

Comments