భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 7

ఈ భాగంలో రెండు పద్యాలకు బదులుగా మూడు పద్యాలు చూద్దాం. ముందు భాగాలతో పోల్చిస్తే భాష/శబ్దం సామీప్యం తక్కువ. అర్ధంసామీప్యం కూడా కొంచెమే. కానీ సందర్భ సామీప్యం, పరమార్ధ సామీప్యం ఉన్నాయని చెప్పుకోవాలి. అందుకే పోతన ఎన్నుకున్న రచనాశైలి, శిల్పం ఒక్కటే. మూడూ “తిట్టు” పద్యాలు. పైకి నిందా పద్యాలుగా ఉన్నా, తరచి చూస్తే అవి నిందాస్తుతి పద్యాలని తెలుస్తుంది. ముందుగా మూడు కథలు.
మొదటి కథ. నాలుగవ స్కంధంలోని దక్షయజ్ఞం ఘట్టంలోనిది. శివుడు ఒక యజ్ఞానికి వెళ్లాడు. శివుని మామగారైన దక్షుడు, యజ్ఞవాటికకు రాగానే సభలోని వారందరూ నిల్చొన్నారు. బ్రహ్మ, శివుడు కూర్చొనే ఉన్నారు. ముఖ్య అతిథి అయిన బ్రహ్మకు నమస్కరించాడు. కూర్చొని ఉన్న శివుని వంక చూసి తనను అవమానించుట కొరకే నిలబడలేదని నానా మాటలు అన్నాడు.

రెండవ కథ. దశమ స్కంధం పూర్వభాగం లోని రుక్మిణీ కల్యాణ ఘట్టంలోనిది. రుక్మిణి లేఖ మేరకు, కృష్ణుడు వెళ్లి ఆమెను తీసుకొని రధం మీద ద్వారకకు వెళ్లిపోతున్నాడు. రుక్మిణి పెద్ద అన్న అయిన రుక్మి వెంబడిచాడు. కృష్ణుని సమీపించి నానా మాటలు అన్నాడు.

మూడవ కథ. దశమ స్కంధం ఉత్తరభాగం లోని శిశుపాలవధ ఘట్టంలోనిది. ధర్మరాజు రాజసూయం చేస్తున్నాడు. భీష్ముడు మొదలైన పెద్దలున్నా కూడా, శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇద్దామని నిర్ణయించుకున్నారు. శిశుపాలకుడికి ఇది నచ్చలేదు. శ్రీకృష్ణునికి ఆక్షేపం తెలిపి సభలో అందరి ముందు నానా మాటలు అన్నాడు.ఆ మూడు పద్యాలు క్రింద చూడండి.

 పూర్తి అర్ధాలకోసం ఆయా లంకెలు నొక్కండి.

4-43-సీ. (దక్షుని మాటలు) 
అనయంబు లుప్తక్రియాకలాపుఁడు మాన; హీనుఁడు మర్యాదలేని వాఁడు 
మత్తప్రచారుఁ డున్మత్తప్రియుఁడు దిగం; బరుఁడు భూతప్రేత పరివృతుండు 
దామస ప్రమథ భూతములకు నాథుండు; భూతిలిప్తుం డస్థిభూషణుండు 
నష్టశౌచుండు నున్మదనాథుఁడును దుష్ట; హృదయుఁ డుగ్రుఁడును బరేతభూ 

నికేతనుఁడు వితతస్రస్తకేశుఁ డశుచి యయిన యితనికి శివనాముఁ డను ప్రవాద 
మెటులు గలిగె? నశివుఁ డగు నితని నెఱిఁగి యెఱిఁగి వేదంబు శూద్రున కిచ్చినటులు.

10.1-1766-సీ. (రుక్మి మాటలు) 
"మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ? ; నేపాటి గలవాడ? వేది వంశ? 
మెందు జన్మించితి? వెక్కడఁ బెరిగితి? ; వెయ్యది నడవడి? యెవ్వఁ డెఱుఁగు? 
మానహీనుఁడ వీవు; మర్యాదయును లేదు; మాయఁ గైకొని కాని మలయ రావు; 
నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు; వసుధీశుఁడవు గావు వావి లేదు;

కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు విడువు; విడువవేని విలయకాల 
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల గర్వ మెల్లఁ గొందుఁ గలహమందు."

10.2-790-సీ. (శిశుపాలుడి మాటలు) 
గురుదేవశూన్యుండు కులగోత్రరహితుండు; దలిదండ్రు లెవ్వరో తడవఁ గాన 
మప్పులఁ బొరలెడు నాదిమధ్యావసా; నంబులం దరయ మానంబు లేదు 
బహురూపియై పెక్కుభంగుల వర్తించు; వావి వర్తనములు వరుస లేవు 
పరికింప విగతసంబంధుండు తలపోయ; మా నిమిత్తంబున మాని సయ్యెఁ

బరఁగ మున్ను యయాతిశాపమునఁ జేసి వాసి కెక్కదు యీ యదువంశమెల్ల 
బ్రహ్మతేజంబు నెల్లఁ గోల్పడిన యితఁడు బ్రహ్మఋషి సేవ్యుఁ డగునె గోపాలకుండు?

ఈ మూడు పద్యాలలోని ద్వంద్వ శిల్పం చూద్దాం. ముందుగా మూడు సీసపద్యాలేను. మూడు సందర్భాలు భగవంతుని సశరీర స్వరూపాన్ని నిందిస్తున్నట్టు ఉన్నా, నిరాకార స్వరూపాన్ని స్ఫురించేట్టుగా ఉన్నాయి. ఉదాహరణకు, “మానము లేని వాడు” అంటూ ఒక నింద మూడు పద్యాలలోనూ కనిపిస్తుంది. శరీరానికి మానముకానీ, నిరాకారమైన భగవంతునికి, పరమాత్మకి మానము వంటిది లేదు కదా. ఆ ఘట్టంలో నిందవేస్తున్నట్టుగా వినిపిస్తున్నా, పోతన దాన్ని నిందాస్తుతిగా మలిచాడు. అలాగే, పోతన, శివ-కేశవుల పరబ్రహ్మతత్వాన్ని, ఏకత్వాన్ని సూచిస్తున్నాడని చెప్పుకోవాలి. ఇలాగే తక్కిన నిందలకు కూడా చెప్పుకోవచ్చు. నిడివి సరిపోనందున ఆసక్తి ఉన్నవారు ఆయా పద్యాల లంకెలకు వెళ్లి తెలుసుకోవచ్చు.

Comments