భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 6

పోతన ద్వంద్వ శిల్పం వ్యాసక్రమంలో ఇది ఆరవది. ముందుగా పద్యాల సందర్భం.

మొదటి పద్యం మొదటి స్కంధంలోనిది. పోతన భాగవతం, మహాభారతంలో యుద్ధసమాప్తం దగ్గర మొదలుపెడుతున్నాడు. ద్రౌపది ఉపపాండవులను కోల్పోయింది, కారకుడైన అశ్వత్థామను తరిమితరిమి పట్టుకొని విడిచిపెట్టేసారు, ధర్మరాజునకు పట్టాభిషేకమయింది. చాలా రోజుల తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు. భార్యలందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు. అందరి దగ్గరికి మాయారూపం ధరించి ఒకేసారి వెళ్లాడు. ప్రతి భార్య, తన దగ్గరకే ముందు వచ్చాడని మురిసిపోతున్నారు. ఒక్కొకరిని ఒక్కో విధంగా పలుకరిస్తున్నాడు. ఆ పరామర్శ చేస్తున్నప్పటి పద్యం.

రెండవ పద్యం దశమ స్కంధంలోని రుక్మిణీకల్యాణం ఘట్టంలోనిది. రుక్మిణికి ఇష్టంలేని పెళ్లి నిశ్చయం చేసారు. శ్రీకృష్ణుడిని వచ్చి పెళ్లిచేసుకోమని లేఖ వ్రాసింది. ముహూర్తం రెండురోజులలోకి వచ్చింది. ఇంకా శ్రీకృష్ణుడు రాలేదు. రుక్మిణికి దేని మీదా మనసు కుదరటంలేదు. దృష్టంతా శ్రీకృష్ణుని రాకమీదనే ఉంది. తన గురించి తాను అసలు పట్టించుకోవడం లేదు. ఆ ఎదురుచూపు పరిస్థితిని వర్ణిస్తున్న పద్యం.

1-269-సీ. (పరామర్శ) 
తిలక మేటికి లేదు తిలకనీతిలకమ! ; పువ్వులు దుఱుమవా పువ్వుఁబోఁడి! 
కస్తూరి యలఁదవా కస్తూరికాగంధి! ; తొడవులు దొడవవా తొడవుతొడవ! 
కలహంసఁ బెంపుదే కలహంసగామిని! ; కీరముఁ జదివింతె కీరవాణి! 
లతలఁ బోషింతువా లతికాలలిత దేహ! ; సరసి నోలాడుదే సరసిజాక్షి!

మృగికి మేఁత లిడుదె మృగశాబలోచన! గురుల నాదరింతె గురువివేక! 
బంధుజనులఁ బ్రోతె బంధుచింతామణి! యనుచు సతులనడిగెనచ్యుతుండు."

10.1-1732-సీ. (రుక్మిణి పరిస్థితి) 
మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ; జలకము లాడదు జలజగంధి; 
ముకురంబుఁ జూడదు ముకురసన్నిభముఖి; పువ్వులు దుఱుమదు పువ్వుఁబోఁడి; 
వనకేళిఁ గోరదు వనజాతలోచన; హంసంబుఁ బెంపదు హంసగమన; 
లతలఁ బోషింపదు లతికా లలిత దేహ; తొడవులు తొడువదు తొడవు తొడవు;

తిలకమిడదు నుదుటఁ దిలకినీతిలకంబు; గమలగృహముఁ జొరదు కమలహస్త; 
గారవించి తన్నుఁ గరుణఁ గైకొన వనమాలి రాఁడు తగవుమాలి" యనుచు 
[పూర్తి అర్ధాలకోసం ఆయా లంకెలు నొక్కండి.]

ఇప్పుడు ద్వంద్వ శిల్పం పరిశీలిద్దాం. ముందుగా రెండూ సీసపద్యాలు. రెండు సందర్భాలలోనూ శ్రీకృష్ణుని రాక కోసం అంతఃపుర స్త్రీలు వేచియుండే పరిస్థితికి సంబంధించినవి. ఒకటి పరామర్శ అయితే రెండవది పరిస్థితి వర్ణన. పరామర్శలో ఉన్నవన్నింటిని తరువాత రుక్మిణి పరిస్థితి వర్ణించడాని వాడాడు పోతన. ఒక్కొక్క పోలిక చూద్దాం.

1. పరామర్శ - తిలకమేటికి లేదు (బొట్టుపెట్టకోలేదేం), రుక్మిణి - తిలకమిడదు నుదుటఁ 
2. పరామర్శ - పువ్వులు దఱుమవా (పువ్వులు దురుముకోలేదేం ), రుక్మిణి - పువ్వులు దుఱుమదు 3. పరామర్శ - కస్తూరి యలదవా (కస్తూరి రాసుకోలేదేం), రుక్మిణి - మృగనాభి యలఁదదు 
4. పరామర్శ - తొడవులు దొడవవా (ఆభరణములు అలంకరిచుకోలేదేం), రుక్మిణి - తొడవులు తొడువదు 
5. పరామర్శ - కలహంసఁ బెంపుదే (హంసలను పెంచుతున్నావా), రుక్మిణి - హంసంబుఁ బెంపదు 
6. పరామర్శ - కీరముఁ జదివింతె (చిలుకలను చదివిస్తున్నావా), రుక్మిణి - కూరిమిఁ గీరముఁ జేరి పద్యముం నొడువదు [10.1-1731-చ
7. పరామర్శ - లతలఁ బోషింతువా (మొక్కలను పెంచుతున్నావా), రుక్మిణి - లతలఁ బోషింపదు 
8. పరామర్శ - సరసి నోలాడుదే (కొలనులో ఆడుకుంటున్నావా), రుక్మిణి - జలకము లాడదు 
9. పరామర్శ - మృగికి మేఁత లిడుదె (జింకలకు మేత ఇస్తున్నావా), రుక్మిణి - వనకేళిఁ గోరదు

అంతఃపుర స్త్రీలు ఎలా ఉంటున్నారో మొదటి స్కంధంలో చూపించాడు కాబట్టి, దశమ స్కంధంలో యవరాణి రుక్మిణిని అవే పరిస్థితులు చూపించాడు పోతన.

మరో ద్వంద్వంతో మరోసారి....

Comments