భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 4

ఇంతకు ముందు భాగాలలో పోలిస్తే ఈ భాగంలో ద్వంద్వ పద్యాలు చాలా దగ్గరలో ఉంటాయి. 

రెండింటికి మధ్యలో కేవలం 35పద్యాలు ఉన్నాయి. ఒకటే ఘట్టంలోనివి. ఏడవ స్కందంలోని ప్రహ్లాద చరితము ఘట్టములోనివి. ముందుగా క్లుప్తంగా సందర్భం. తెలిసిన కథే. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు. చదువుకోసం గురుకులానికి వెళ్లి తిరిగి వస్తాడు.

మొదటి పద్యం, చదువుకోసం గురుకులానికి వెళ్లబోయే కొడుకునకు తండ్రి జాగ్రత్తలు చెప్పే సందర్భంలోనిది. “చదవనివాడు మూర్ఖుడు, చదివితే వివేకం, చతురత కలుగుతాయి. ఆచార్యులవద్ద చదువుకో” అంటాడు. ఇక రెండవ పద్యం - తిరిగి వచ్చిన ప్రహ్లాదుడు తాను ఏమి నేర్చుకున్నాడో చెప్పినది. “గురువులు ధర్మార్థ శాస్త్రాలు చుదువుకున్నాను. అసలు చదువులో మర్మములన్నీ తెలుసుకున్నాను” అంటాడు. 

ఇవిగో పద్యాలు.
చదువనివాఁ డజ్ఞుం డగు, 
జదివిన సదసద్వివేక చతురత గలుగుం 
జదువఁగ వలయును జనులకుఁ, 
జదివించెద నార్యులొద్ధఁ జదువుము తండ్రీ!
చదివించిరి నను గురువులు, 
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ 
జదివినవి గలవు పెక్కులు, 
చదువులలో మర్మ మెల్లఁ జదివితిఁ దండ్రీ! 

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాము. రెండూ కంద పద్యాలు. రెండు పద్యాలూ “చదువు” అనే పదంతోనే ప్రతిపాదంలోనూ ప్రాసనడుస్తుంది. రెండు పద్యాలు “తండ్రీ” అనే సంబోధనా పదంతోనే ముగుస్తున్నాయి. మనం చిన్నపిల్లలను, “ఏం నాన్నా”, “బంగారు తండ్రీ”, ”చిన్న తండ్రీ” అని సంబోధించినట్టు, పోతన హిరణ్యకశిపుని చేత ప్రహ్లాదుడిని పిలిపించాడు. దానిలో కొడుకు చదువుకుని వృద్దిలోకి రావాలని అనునయంగా చెప్పే తండ్రి తపన వినిపిస్తుంది. నిజానికి కనిపిస్తుంది కూడాను. అలాగే ద్వంద్వ శిల్పానికి కూడా సరిపోతుంది. అందుకే ప్రయత్నపూర్వకంగా ఆ పదంతో మొదటి పద్యం పూర్తిచేసాడు.

మరొక ద్వంద్వంతో త్వరలో...

Comments