రాగం తానం పల్లవి - ఒక పరిచయం

పరిచయం:
రాగం తానం పల్లవి” (రా.తా.ప), అంటూ సాగే పాట, శంకరాభరణం (1980) సినిమాలోనిది. వేటూరి వ్రాసారు. నా చిన్నప్పుడు, మా మేనమామ, మా అమ్మకు ఇంట్లోని ముగ్గురు పిల్లల క్షేమం అడుగుతూ, “రాగం, తానం, పల్లవి ఎలా ఉన్నారు?” అని ఉత్తరం వ్రాసాడట. మా అమ్మ, ఆ విషయం ఇప్పటికీ మరిపెంగా గుర్తుచేసుకుంటారు. నాకు చాలా కాలం, రా.తా.ప. అంటే ఫలానా సినిమాలోని పాట అనే తెలుసు.
అసలు, రాగం-తానం-పల్లవి (రా.తా.ప - RTP), నేటి కర్ణాటక సంగీత కచ్చేరీలలో ప్రదర్శించే ఒక ప్రక్రియ. ఈ వ్యాసం కార్ణాటక సంగీతంలోని ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికోసం వ్రాసినది. ప్రవేశం ఉన్నవారు సరదాకి చదువుకోవచ్చును. సంగీతంలోని లోతులలోకి పోకుండా పైపైన గీసే రేఖాచిత్రం మాత్రమే.

రా.తా.ప - రేఖాచిత్రం: 
రా.తా.ప అనే ప్రక్రియను గాత్రం (vocal) లేదా వాయిద్య (instrument) విద్వాంసులు చేయవచ్చు. వీరిని ముఖ్యవిద్వాంసులనుకుంటే, వారితో పాటే “పక్క వాయిద్యాలు” కూడా ఉంటారు. ఈ పక్క విద్వాంసులు సాధారణంగా, పాటకు సాయం (వయెలిన్ లేక/ఇంకా వీణ) చేసేవారు, తరువాత లయకు సాయం చేసే తాళ వాయద్యాలు (percussion - మృదంగం లేక/ఇంకా ఘటం).
రా.తా.ప ను మూడు ఘట్టాలుగా విభజించుకోవచ్చును. రా-రాగం (లయరహితం/తాళరహితం), తా-తానం(కొంత లయయుతం/తాళయుతంగా), ప-పల్లవి (లయయుక్తం/తాళయుక్తం).

  1. రాగం - తాళరహితం (మృదంగం, ఘటం లేకుండా) ఎన్నో రాగాలు ఉన్నా, ఒక రాగం ఎంచుకుంటారు. ఎంచుకున్న రాగంలో “రాగం తీస్తారు”. దీనినే “రాగ ఆలాపన” లేక “ఆలాపన” అంటారు. పదాలు (సాహిత్యం) లేకుండా కేవలం “ఆ..ఆఆ..ఆఆఆ...ఆఆఆఆ” (ఆకారం - రెండు అర్ధాలు - “ఆ” శబ్దం ఇంకో అర్ధం - రూపం). కొంత మంది మరికొన్ని అచ్చులు (ఈ, ఐ, ఓ, ఓం, మ) అంటూ పాడుతారు. మరకొంత మంది “తదరి”, “నా”, “హరీ” అంటూ పాడుతారు. ఈ రాగాలాపన అనేది, రాగ “ఆకారాన్ని” లేక “రేఖాచిత్రాన్ని” తెలియజేయటం ముఖ్య ఉద్దేశ్యం . చెవులకు వినిపించే శబ్దానికి/రాగానికి ఆకారమేమిటి? ఏదో కంటికి కనిపించే వస్తువో లేక బొమ్మో అయినట్టు అనే ఆశ్చర్యం కలగటం సహజం. మనం రాసుకునే అక్షరాలు (అ నుంచి ఱ వరకు) ఏదో ఒక నిర్దిష్టమైన శబ్దానికి ప్రతీకలే కదా. అలాగే, సంగీతలో ఉండే స్వరాలతో (సరిగమపదని) తో చేయబడ్డ, ప్రతి రాగానికి ఒక స్వరూపం ఉంటుంది. రాగస్వరూపం తెలియకపోయినా నష్టం కానీ, కష్టం కానీ లేదు. రా.తా.ప. గురించి తెలుసుకోవడానికి అడ్డుకాబోదు. తెలుకోవలసిన విషయం ఏమిటంటే, విద్వాంసులు క్రింది(లో)/మధ్య(మామూలు)/పై(తార) స్ధాయి శృతులు వినిపించే ప్రయత్నం చేస్తారు. అప్పుడప్పుడూ క్రింది/తార స్ధాయి వినిపించినా, చాలా వరకూ మధ్యస్ధాయి వినిపిస్తారు. వీలయితే కొండలు, లోయలు కూడిన ఒక చిత్రాన్ని ఊహించుకోండి. కొండలు/గుట్టలు తారస్ధాయి అయితే, లోయలు క్రింది స్ధాయి అన్నమాట. విద్వాంసులు తమ ఆలాపన అనే కుంచెతో ఒక చక్కని బొమ్మ వేస్తున్నారన్నమాట. నిజానికి రాగానికి రంగుకు పెద్ద తేడాలేదు. రంగు - రాగం, రెండూ పర్యాయపదాలు, సమానార్ధకాలు. ఈ రాగాలాపన ముందస్తుగా తయారుచేసుకొనేది కాదు. మనసుకు తోచిన విధంగా అనుకున్న రాగంలో, అప్పటికప్పుడు ఊహించి ప్రదర్శన చేస్తారు. దీనికి “మనోధర్మం” అని పేరు. సమయానికి, ప్రతిభకు తగ్గట్టుగా 5-30నిమిషాల పాటు ఆలాపన చేస్తారు. రాగ ఆలాపన అనేది మృదంగం సాయం అవసరం లేని భాగం.
  2. తానం - కొంత తాళయుతంగా (ఎప్పుడైనా మృదంగం లేక/ఇంకా ఘటం) పైన చెప్పుకున్న రాగాలాపన వివరాలన్నీ ఇక్కడకూడా చెప్పకోవాలి. తేడా మాత్రం ఆలాపనకు అచ్చులైతే తానంకు హల్లులు. అన్ని హల్లులూ కాదు, కేవలం ఆ-నం-త ఆ-నం-ద (అనంత ఆనందం - Infinite Bliss). మృదంగం లేకపోయినా ఒకరకమైన సొగసుతో, లయతో సాగే భాగం. ఎప్పుడైనా మృదంగం సాయం ఉంటుంది. రాగాలాపనకు మల్లే తానం కూడా మనోధర్మమే. మనసుకు తోచిన ఊహాగానం!!
  3. పల్లవి - తాళయుక్తం: (మృదంగం లేక/ఇంకా ఘటం కలుపుకొని) ఈ పల్లవి భాగానికి మరికొన్ని ఉపభాగాలు ఉన్నాయి. ఇవికూడా మనోధర్మాలే. ఊహాగానాలే.
    1. పల్లవి - తాళయుక్తం - పదాలు (సాహిత్యం) రాగాలాపన, తానం అర్ధవంతమైన పదాలు లేనివి. పల్లవి ఆ రా.తా.ప. ఊహాచిత్రం పదాలతో ఇదీ స్వరూపం అని తేలుతుంది. కానీ, కేవలం ఒకేఒక వాక్యం మాత్రమే ఉంటుంది. అందుచేత విద్వాంసులు ఈ వాక్యనిర్మాణాన్ని చాలా జాగ్రత్తగా, తెలివిగా చేస్తారు. చిన్న పదాలతో మొదలై పెద్దపదాలతో అంతమైయ్యేట్టు చూస్తారు. కొండకచో రాగం పేరు చొప్పిస్తారు. రాగమనే కుంచెతో వేసే ఒక్కో గీత ఒక్కో “సంగతి”. సంగతులు సంగతులుగా పాడుతారు.
    2. పల్లవి - తాళయుక్తం - స్వరం (స్వరప్రస్తారం) ఇక రాగస్వరూపాని పదాలతో తెలియజేసిన తరువాత విద్వాంసులు, అసలు ఈ రాగంలో ఉన్న స్వరాలు (సరిగమపదని) ఇవీ అని విశదీకరిస్తారు. ఆ రాగంలో స్వరాలు వచ్చే క్రమం, సక్రమంగా మార్చిమార్చి ప్రదర్శన చేస్తారు. ప్రతి “సంగతి”, పల్లవిలోని పదాలతో పూర్తిచేస్తారు.
    3. పల్లవి - వేరే రాగాలు (రాగమాలిక) ఇక చివరికి వచ్చేసాం. విద్వాంసులు తమతమ విద్యాప్రదర్శన నిమిత్తం వేరే రాగం అందుకుంటారు. అటుతిరిగి ఇటుతిరిగి మళ్లీ మొదట ఎంచుకున్న రాగంలోనికి వస్తారు. ఇలా పక్కకు పోయి తటాలున మళ్లీ అసలు రాగంలోనికి రావటం కూడా ఎంతో శ్రమ, పరిశ్రమతో నేర్చే విద్య. కొన్నిమార్లు ఒకదాని తరువాత ఒకటి, నాలుగైదు రాగాలు వినిపిస్తారు. దీనిని “రాగమాలిక” అంటారు. 
    4. ఇంక, మరొక్క సారి పల్లవి, సాహిత్యం, స్వరాలు ఎత్తుకొని పూర్తిచేస్తారు. 

ఉదాహరణలు:
  1. రా.తా.ప - బృందావన సారంగం - శ్రీ. టీవీ శంకరనారాయణ
    1. 0:09 - రాగం - గాత్రం “నా...న..న” అంటూ ఒక రేఖాచిత్రం (outline) మొదలువుతుంది. పక్కనే వయెలిన్ అనుసరణ.
    2. 2:09 - రాగం - వయెలిన్ ఒక్కరే కాసేపు రాగాలాపన
    3. 3:57 - రాగం - కొన్ని చప్పట్ల తరువాత, గాత్రం మరలా రాగాలాపన కొనసాగింపు, వయెలిన్ అనుసరణ
    4. 4:52 - తానం - గాత్రం “ఆ..నం...త” అంటూ తానం అందుకొంటున్నారు
    5. 5:21 - తానం - వయెలిన్ గాత్రానికి ధీటుగా జవాబు
    6. 5:48 - తానం - గాత్రం తానం కొనసాగింపు, కొంచెం వడివడిగా
    7. 7:12 - తానం - వయెలిన్ మరలా తనేమీ తక్కువ కాదంటూ, జవాబు
    8. 7:47 - తానం - గాత్రం మరలా తానం అందుకుని సుమారు 9:17 దగ్గర ముగింపు. [మృదంగ విద్వాంసులు తాను సిద్ధమేనని చిన్న దరువుతో సంకేతం తెలియజేస్తున్నారు.]
    9. 9:23 - పల్లవి - సాహిత్యం - గాత్రం “శ్రీరంగ, హరిరంగ, పాండురంగ, బృందావనసారంగ” అంటూ “పాట” మొదలు - ఉన్న 4 పదాలు, క్రమంగా చిన్న పదం నుంచి పెద్ద పదం కావటం గమనించవలసిన విషయం, . ఆ పెద్ద పదం, “బృందావనసారంగ”, రాగం పేరు కావటం చమత్కారం. అక్కడక్కడా వేరువేరు అక్షరాలను సాగదీస్తూ, నాటకీయంగా ఆపుతూ, నొక్కుతూ, మెత్తగా పలుకుతూ, వడిగా పరిగెడుతూ పాడినవిధంగా పాడకుండా హృద్యంగా సాగుతుంది. వయెలిన్ వెంట అనుసరణ, మృదంగ లయ/తాళం సాగుతూంటుంది.
    10. 14:15 - పల్లవి - స్వరాలు - ఇప్పుడు పాడే రాగానికి, ఆధారమైన స్వరాలను, వాటి నడకను సాక్షాత్కరింప చేసే సమయం. పోనుపోను స్వరాలు వడివడిగా సాగుతాయి. ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. సుమారు 17:01 ఈ వడి వలన స్వరాలు కాస్తా కలసిపోయి రాగమైపోతాయి. ఊపిరి బిగపట్టి స్వరపరంపర నడుస్తుంది. వయెలిన్ వెనుకనే వస్తూ 18:43దగ్గర ముగుస్తుంది.
    11. 18:44 - పల్లవి - అన్యరాగం - ఏమాత్రం చెప్పాపెట్టకుండా వేరే రాగంలోనికి (హంసానంది?) ఆలాపనగా మొదలై, స్వరాప్రస్థారం (21:09) నడచి, 22:57 దగ్గర మరలా సాహిత్యంతో మూగుస్తుంది. 
    12. 23:09 - పల్లవి - అన్యరాగం - వయోలిన్ కూడా ధీటుగా ఈ రాగంలో తన ప్రతిభ చూపించి 24:45 దగ్గర మరలా సాహిత్యంతో మూగుస్తుంది.
    13. 24:56 - చివరి స్వరప్రస్థారం. ముగింపు.
  2. రా.తా.ప - రేవతి - శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
    1. 0:00 - రాగం - ఆలాపన “ఆ..ఆఆ..ఆఆఆ” అంటూ మొదలై, మధ్యలో “హం...హమ్..”, “హరీ...”, “తదరీ...”, “నా..” వినిపిస్తాయి. 3:05 దగ్గర కాసేపు ఆపి పాడుతున్న రాగం రేవతి అని ప్రేక్షకులకు తెలియజేస్తారు. 
    2. 4:42 - రాగం - ఒక స్వరాన్ని, 5:13 దగ్గర 30సెకన్ల పాటు బిగపట్టి తన ప్రతిభను చూపించగానే, చప్పట్లు మ్రోగుతాయి. రాగాలాపన కొనసాగుతుంది.
    3. 6:54 - రాగం - ఇక ఆలాపనలో మరో స్ధాయికి (పై స్ధాయి) చేరుకుంటుంది.
    4. 7:38 - రాగం - పై స్ధాయినుంచి తటాలున క్రింది స్ధాయికి అలవోకగా జారుతుంది. మూడు స్ధాయిలలోనూ - కిందికి, పైకి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, కలయ తిరగటం శ్రీ. మంగళంపల్లి ప్రత్యేకత.
    5. 7:50 - రాగం - క్రింది స్థాయి లోతులలోంచి పై స్థాయిలో పైపైకి వెళ్లే వడి అద్భుతం. ఒక్కొక్క సంగతితో తన సంగతేంటో చూపించే ప్రయత్నం గమనించాలి.
    6. 10:44 - తానం - ఎటువంటి సూచన కానీ విరామం లేకుండా రాగాలాపన కాస్తా తానంలోనికి జారుతుంది.
    7. 12:21 - తానం - వయెలిన్ మొత్తానికి కాసేపు తన సత్తా చాటుకునే సమయం లభిస్తుంది.
    8. 12:57 - తానం - సాధారణంగా మృదంగం సాయంలేకుండా సాగే తానంలోనికి మృదంగ ధ్వానం చేరి ఒక రకమైన ఆశ్చర్యం కలిగిస్తుంది. శ్రీ. మంగళంపల్లి స్వతహాగా మృదంగంలో కూడా ప్రవేశం ఊండటతో చాలా తేలికగా, అందంగా, హృంద్యంగా ఈ ఘట్టం రక్తి కట్టిస్తారు . 14:33 దగ్గర వయెలిన్ తనదైన శైలి చూపిస్తారు.
    9. 15:16 - తానం - ఇక రేవతిలోని మార్దవాన్ని చూపిస్తూ తానం కొనసాగుతుంది. 19:04 దగ్గర చప్పట్లతో తానం మూగస్తుంది.
    10. 19:10 - పల్లవి - సాహిత్యం - “మహేశ్వరీ - కావుమా - ఉమా - మా - మాతంగి - మరకతాంగి” అనే సాహిత్యంతో మొదలౌతుంది. ఒక 7నిమిషాల పాటు వడివడిగా, నెమ్మదిగా, ముందువెనుకగా, క్రింద-పైన, గాత్రానికి వయొలిన్ మధ్యలో జరిగే విన్యాసం విని తీరవలసిందే.
    11. 26:56 - పల్లవి - స్వరప్రస్ధారం - అంతర్లీనంగా ఉన్న స్వరాలను విడివిడిగా చూపేప్రయత్నం. ప్రతి సారి మరలా సాహిత్యంతో పూర్తికావటం ఒకరకమైన ఉత్తేజం కలిగిస్తుంది. స్వరాలలోని “మ”, “స-రి-మ “, సాహిత్యంలోని “ఉమా” కొంచెం నొక్కి వక్కాణించి చూపించటం సరదాగా ఉంటుంది.
    12. 29:14 - పల్లవి - రాగమాలిక - చారుకేశి రాగం. 31:35 వయోలిన్ జవాబు.
    13. 32:44 - పల్లవి - రాగమాలిక - సహాన రాగం. 34:44 వయోలిన్ జవాబు.
    14. 35:57 - పల్లవి - రాగమాలిక - సింధుభైరవి రాగం. 38:18 వయోలిన్ జవాబు.
    15. 39:43 - పల్లవి - చివరి వెల్లువ.
  3. సినిమా - శృతిలయలు ఒక చిన చిన్న రా.తా.ప. 4ని. నిడివితో ఉంటుంది. రాగాలాపనకు ఒక సంగతి, తానంకు ఒక సంగతి, పల్లవి సాహిత్యాని ఒక సంగతి, పల్లని స్వరప్రస్ధారాని ఒక సంగతి, మూడూ రాగాల రాగమాలికకు తలొక సంగతి. పల్లవి సాహిత్యానికి గాను, ప్రాచుర్యంలోనున్న, సామజవరగమనకృతి పల్లవి, వాడారు.
మరిన్ని వివరాలు: 
ఇక్కడి వరకూ ఓపికగా చదివితే మీకు ఒక సాహో. Youtubeలో ఎన్నో వివరాలు ఉన్నాయి. TM కృష్ణ ద్వారా 40 భాగాల ఉపన్యాసం. [Note: నేను వినలేదనుకోండి] మరిన్ని వీడియోలు కావాలంటే Youtubeలో “lec dem <keyword>” (lecture demonstration రాగం/RTP/carnatic) వెతకాలి.

ముగింపు: 
3 ప్రధాన రంగులు ఎరుపు, ఆకుపచ్చ, నీలము కలిస్తే ఎన్ని వర్ణాలు పుడతాయో కదా. అలాగే 7 (సప్త)స్వరాలు (నిజానికి 12గా చెప్పుకోవాలి.) కలయికతో ఎన్నో రాగాలకు ఆస్కారముంది. కానీ కొన్ని రాగాలు మాత్రమే ప్రజాదరణ పొందాయి. ఆయా రాగాలలో చాలా కృతులు చేయటం వలన కూడా కావచ్చును. కాలగమనంలో కొన్ని రాగాల స్వరూపం కూడా మారతూ ఉంటుంది.

రా.తా.ప. ఒక ప్రయాణం. కంటికి కనపడని ఆకారం. ఆ ఆకారాన్ని మనసులో సాక్షాత్కరిస్తూ, స్వరఝరిలో ఓలలాడించడమే సాంప్రదాయ సంగీత లక్షణం. ఇది నిశ్శబ్దం లోనుంచి ఓంకారానికి, ఒక్కొక్క స్వరం పేర్చి, లయతో మేళవించి ఒక పద్ధతి ప్రకారం సాగించే శబ్ద ప్రయాణం. ఆకారంతో మొదలై నిర్దిష్టమైన స్వరప్రస్ధారంతో మనముందు సాక్షాత్కరింప చేసే విన్యాసం. రాగమాలిక, ఎన్ని రాగాలున్నా చివరకు గమ్యం ఒకటేనన్న అనిర్వచనీయమైన సత్యాన్ని పరిచయం చేస్తుంది. ఇది ప్రేక్షకుల ముందు సాక్షాత్కరింప చేయాలంటే ఎంతో సాధన, తపస్సు (నాద యోగా) అవసరం. అలా చేయగలవారే నాదబ్రహ్మ. అలాంటి వారిని కనీసం చూసి, విని వారి విద్యను ప్రోత్సహించాల్సిన విషయం.

ఇక, వ్యాసం మొదట్లో చెప్పిన పాట, ఈ రాగం-తానం-పల్లవి అనే ప్రక్రియను వర్ణిస్తూ చేసిన పాట మాత్రమే. సినిమా పాటతో పాటుగా సంగీత కచ్చేరీలలోని రా.తా.ప కూడా ఆనందించండి. కాస్త ప్రయత్నం అవసరం. చేయండి.

Comments